//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాల సమ్మె రేపు

Category : national

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు దిగనున్నాయి. ఈ నెల 22న, మంగళవారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న తొమ్మిది కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. విలీన ప్రతిపాదనను వ్యతిరేకించడంతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం యూఎఫ్‌బీయూ సమ్మెకు పిలుపునిచ్చింది.

ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె ప్రతిపాదనపై ఖాతాదారులకు సమాచారం అందించాయి. ఒకవేళ సమ్మె జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో నగదు లావాదేవీలు, చెక్కు క్లియరెన్స్ సేవలకు తీవ్ర విఘాతం కలుగనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో మాత్రం కార్యకలాపాలు యధావిధిగా కొనసాగునన్నాయి.

 యూఎఫ్‌బీయూ కింద పనిచేస్తున్న 9 ఉద్యోగ సంఘాల్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్‌ఓబీడబ్ల్యూ) కూడా ఉన్నాయి. బ్యాంకు యాజమాన్యాల సంఘంతో చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ డీటీ ఫ్రాంకో అన్నారు.

తమ డిమాండ్ల పరిష్కారంపై ఇటు బ్యాంకు యాజమాన్యాలు గానీ, అటు ప్రభుత్వం గానీ హామీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. యూఎఫ్‌బీయూ పరిధిలోని తొమ్మిది బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాల్లో 10 లక్షల మంది సభ్యులు ఉన్నారు. దేశంలోని 21 ప్రభుత్వ బ్యాంకులకు మార్కెట్లో 75 శాతం వాటా ఉంది.

Related News