ప్రమోషన్లు, వేతనాల పెంపును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం తెలపడంతో ప్రముఖ ఐటి సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధి రేటు మందగించడం, వ్యాపారాల వ్యయాలు పెరుగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దానితో మధ్యస్థాయి ఉద్యోగాల కోత తప్పక పోవచ్చని భయపడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ తన ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ను పంపుతోంది.
ఈ మెయిల్స్‌లో వేతనాల సవరణ, ప్రమోషన్లను అక్టోబర్ 1 నుంచి చేపడతామని కంపెనీ సీటీఎస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జిమ్ లెనోక్స్ చెప్పారు.ప్రతిఏడాది జూలై 1న వేతనాల సవరణను, ప్రమోషన్లను కంపెనీ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది అక్టోబర్‌లో చేపడతామని కంపెనీ చెప్పింది. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2,61,000 మంది ఉద్యోగులున్నారు.
జిమ్ లెనోక్స్ పంపిన ఈ-మెయిల్స్‌లో మేనేజర్ స్థాయి వరకున్న ఉద్యోగులు తమ బేసిక్ వేతనంపై శాతం పెరుగుదల ఉంటుందని తెలిపారు.అదేవిధంగా సీనియర్ మేనేజర్, ఆపై స్థాయి వారికి మొత్తం ఒకేసారి చెల్లిస్తామని లేదా ప్రతినెలా పెంచుతూ ఉంటామని చెప్పారు. పనితీరుకు సంబంధించిన బోనస్‌లు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు.
అసోసియేట్లకు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకున్న ఉద్యోగులకు ప్రమోషన్లను త్వరలోనే ప్రకటిస్తామని, అవి కూడా అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయని ఈ-మెయిల్లో తెలిపారు.సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పై స్థాయి వారి ప్రమోషన్ల వివరాలను వేరుగా ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. అయితే వీటిపై స్పందించడానికి కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి నిరాకరించారు. అప్రైజల్ సైకిల్‌ను జాప్యం చేయడం ఐటీ ఇండస్ట్రీ కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటుందనే పరిస్థితులకు సంకేతమని కొంతమంది ఉద్యోగులంటున్నారు.