Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముందుచూపు కరవు.. ప్రత్యామ్నాయం బరువు..

Category : state politics

నిర్మల్‌-మంచిర్యాల జిల్లాల సరిహద్దులోని జన్నారం మండలం ఇందన్‌పల్లి వద్ద బురదమయంగా మారిన ప్రత్యామ్నాయ రహదారి చిత్రమిది. చిన్నపాటి వర్షం కురిసినా వరద వచ్చి ఇక్కడ ప్రత్యామ్నాయంగా వేసిన మట్టి రహదారి బురదమయంగా మారుతోంది.

శనివారం రాత్రి ఇలాగే ఇక్కడ చిన్నపాటి వరద రావటంతో అర్ధరాత్రి పూట వాహనాలన్నీ అక్కడే నిలబడిపోవాల్సి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయ రహదారి బురదమయంగా మారటంతో వాహనాల చక్రాలు అందులో కూరుకుపోవటం లేదా జారిపోతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎదులాపురం, ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే వర్షాకాలం సమీపిస్తోందని తెలుసు. అయినా పనుల్లో వేగం పెంచలేదు. ప్రధాన రహదారులపై వంతెన నిర్మాణాలు పూర్తి చేయలేదు. అనుకున్నంతా అయ్యింది. వర్షం కురిస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రత్యామ్నాయ దారులు కొట్టుకుపోతున్నాయి. గంటల తరబడి చుట్టూ తిరిగి గమ్యానికి చేరుకోవాల్సిన పరిస్థితి. రాత్రివేళల్లో ప్రయాణికులు, వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మార్గాల్లో వంతెనలు నిర్మిస్తున్న చోట ప్రత్యామ్నాయ దారులు కొట్టుకుపోయి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై 'న్యూస్‌టుడే' పరిశీలన కథనం.

మంచిర్యాల, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లో వంతెనల పనులు నడుస్తున్న రహదారుల్లో భారీగా వాహనాల రాకపోకలు ఉంటాయి. అయితే వంతెనలు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటం, మళ్లింపు వంతెనలు బలహీనంగా ఉండటంతో చిన్న వరద వచ్చినా రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఈ రహదారుల్లో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి.

బస్సులు 50

ఆటోలు 100

జీపులు 100

కార్లు 70

లారీలు 200

ప్రయాణికులు 15వేలకు పైగా

ఆదిలాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రహదారిలో జన్నారం మండలంలో నిర్మల్‌-మంచిర్యాల సరిహద్దులో ఇందన్‌పల్లి వద్ద నిర్మిస్తున్న వంతెనల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జన్నారం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మరో వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గుత్తేదారు వాగుల్లో నుంచి ప్రత్యామ్నాయ(డైవర్షన్‌) రహదారులు నిర్మించారు.ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ సమీపంలోని సరసాల వద్ద నిర్మిస్తున్న వంతెన వద్ద కూడా ఇలాగే మళ్లింపు రహదారి నిర్మించారు. చిన్నపాటి వర్షానికే వచ్చే వరదలతో ఈ రహదారులు కోతకు గురై వాహనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రారంభం అవుతున్నదని తెలిసినా కూడా అధికారులకు ముందు చూపు కొరవడి సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో ఈ ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయి పలు ప్రాంతాల ప్రయాణికులు ఆగచాట్ల పాలవ్వాల్సి వస్తోంది.

బస్సులను దారి మళ్లిస్తున్నారు

ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ ప్రాంతాల నుంచి కరీంనగర్‌, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ వారు దారి మళ్లిస్తున్నారు. ఇతర వాహనాలు సైతం ఇదే దారిన వెళ్లాల్సి వస్తోంది. వర్షం కురిసి వరదలు వచ్చినట్లు సమాచారం రాగానే అటువైపు వెళ్లే బస్సులు కడెం మండలంలోని పాండ్యాపూర్‌, చిట్టాపూర్‌, కలమడుగు, మునిమడుగు ప్రాంతాల మీదుగా దారి మళ్లించి పంపిస్తున్నారు. దీంతో కనీసం ముప్పై కిలోమీటర్లకు పైగా దూరం పెరగటంతో పాటు దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల వరకు అదనపు సమయం ప్రయాణించాల్సి వస్తోంది.

ప్రత్యామ్నాయ రహదారి బురదమయం

ఈ చిత్రం జన్నారం పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిర్మిస్తున్న వంతెన వద్దది. వంతెన నిర్మాణ దశలో ఉండటంతో వాహనాలు వెళ్లటానికి ప్రత్యామ్నాయంగా నిర్మించిన రహదారి దుస్థితి ఇది. చిన్నపాటి వరద వస్తే చాలు వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తోంది.

కోతకు గురై.. ఇబ్బందులు

ఈ చిత్రాలు ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌(టీ) వెళ్లే రహదారిలో సరసాల గ్రామం వద్దవి. వంతెన నిర్మిస్తున్నందున గుత్తేదారు ప్రత్యామ్నాయ రహదారి నిర్మించారు. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు వరదలు వచ్చి రహదారి కోతకు గురైంది. ఈ ప్రాంతంలో దాదాపు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం ఏ చిన్నపాటి వర్షాలు కురిసినా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల వారు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

ఆగస్టు వరకు పూర్తి చేయిస్తాం

నజీర్‌ అహ్మద్‌, ఎస్‌ఈ ఆర్‌ అండ్‌ బీ

గుత్తేదారులకు చెల్లింపుల్లో కొంత జాప్యం చేసుకోవటంతో పనుల్లో వేగం తగ్గింది. అయినప్పటికి ఆగస్టు వరకు వంతెనల నిర్మాణం పనులు పూర్తి చేయిస్తా. ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటానికి ఆలోచనలు చేస్తున్నాం.