సాకర్ సూపర్ స్టార్‌గా ప్రపంచమంతటా నీరాజనాలందుకుంటున్న క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. స్పెయిన్‌తో ‘డ్రా’గా ముగిసిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో చెలరేగిన ‘సీఆర్7’ ఇప్పుడు జట్టు తరఫున ఏకైక గోల్ నమోదు చేసి మొరాకో ఆట ముగించాడు.
మ్యాచ్‌లో అనేక సందర్భాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినా, ఫినిషింగ్ లోపాలతో వెనకబడిన మొరాకో 2018 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. తాజా గోల్‌తో యూరప్ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రొనాల్డో రికార్డులెక్కాడు. మాస్కో: ‘ఫిఫా’ వరల్డ్ కప్‌లో పోర్చుగల్ జోరు కొనసాగింది.
తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను 3–3తో నిలువరించిన ఆ జట్టు గ్రూప్ ‘బి’లో బుధవారం మొరాకోను 1–0తో ఓడించింది. పోర్చుగల్ తరఫున ఏకైక గోల్‌ను 4వ నిమిషంలో హెడర్ ద్వారా కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. ఈ గెలుపుతో పోర్చుగల్ నాలుగు పాయింట్లతో నాకౌట్ దశకు చేరువ కాగా... వరుసగా రెండో పరాజయంతో మొరాకో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
1998లో వరల్డ్ కప్ ఆడిన తర్వాత వరుసగా నాలుగు సార్లు అర్హత సాధించలేకపోయిన ఆఫ్రికా దేశం మొరాకో... 20 ఏళ్ల తర్వాత క్వాలిఫై అయినప్పటికీ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.