శాంతిని వినియోగించడం అలవర్చుకోవాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు పోప్ ఫ్రాన్సిస్ హిత బోధ చేశారు. శాంతిదూతగా వర్ధిల్లాలని హితవు పలికారు. దీనిపై స్పందించిన ట్రంప్ పోప్ సందేశాన్ని తాను మరువనని హామీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుని హోదాలో విదేశీ పర్యటనలతో బిజిబిజిగా గడుపుతున్న డొనాల్డ్ ట్రంప్ వాటికన్‌సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో మొదటిసారిగా సమావేశమయ్యారు. ఆయనకు మార్టిన్ లూథర్ కింగ్ రాసిన పుస్తకాలను బహుమతిగా అందజేశారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్న ఇద్దరూ నేతలు ఈ సమావేశంలో నవ్వులు చిందిస్తూ సరదాగా గడపడం విశేషం. మెక్సికో-అమెరికా మధ్య ప్రహారీ నిర్మిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనను పోప్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
పోప్ తనను ఆహ్వానించి ఆశీర్వదించటం తనకు లభించిన అపూర్వ గౌరవమని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరువురు దాదాపు 30 నిముషాలసేపు దుబాసీల సాయంతో భేటీ అయ్యారు.
కాగా రాబోయే రోజులలో ప్రపంచ నాయకులతో జరిపే సమావేశాలలో వాతావరణ మార్పు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వమని పొప్ ట్రంప్ ను కోరారు. పర్యావరణంపై పారిస్ ఒప్పందం నుండి అమెరికా ఉపసంహరించుకో వద్దని కూడా సూచించారు.