Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కు చిరాకు తెప్పిస్తున్న బెజవాడ వైసీపీలో అంతర్గత పోరు ..

Category : politics state

విజయవాడ వైసీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ పరిస్ధితిపై అధినేత జగన్‌ దృష్టి పెట్టారు. ఇటీవ‌ల ఆయన జిల్లా పార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మావేశంలో విజయవాడ లోని 3 నియోజక వర్గాలపై స‌మీక్షించారు. న‌గ‌రంలో ఉన్న మూడు నియోజ‌క‌ర్గాల‌ను త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైతే మ‌రో సారి న్యాయ‌క‌త్వాన్ని మార్చాల‌ని నేత‌ల‌కు సూచించారు. ఈ నేప‌ధ్యంలో మ‌రో సారి విజ‌య‌వాడ వైసీపీలో మార్పులు త‌ప్పేలా లేవు. ఇప్పటికే జ‌రిగిన మార్పులు పార్టీకి బ‌లం చేకూర్చడం లేద‌ని అధినేత బావిస్తున్నారు. దీంతో మ‌రోసారి నాయ‌క‌త్వాన్ని మార్చేందుకు పార్టీ చ‌ర్యలు చేప‌డుతుందా ? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఓ ప‌క్క అసంతృప్తులు.. మ‌రో ప‌క్క నేత‌ల‌ గ్రూపు రాజ‌కీయ‌ల‌తో గంద‌ర‌గోళంలో ఉన్న క్యాడ‌ర్‌కు అధినేత క్లారిటీ ఇచ్చేదెప్పుడు...

విజ‌య‌వాడ వైసీపీలో గ్రూపు రాజ‌కీయాలు, నేత‌ల మ‌ధ్య విభేదాలు క్యాడ‌ర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేదెవ‌రో తెలియ‌క కార్యకర్తలు గంద‌ర‌గోళంలో ఉన్నారు. టికెట్ నాదంటే, నాదని నేత‌లు త‌న్నుకుంటుంటే తాము ఎవ‌రి వైపు ఉండాలో తెలియక తలల పట్టుకుంటున్నారు కార్యకర్తలు. దీనికి తోడు ఇటీవ‌లే వంగవీటి రాధా రాజీనామా చెయ్యడం పార్టీకి కాస్త న‌ష్టాన్ని మిగిల్చింది. దీంతో విజ‌య‌వాడ‌ ప‌రిస్ధితిపై ఇటీవ‌లే స‌మీక్ష నిర్వహించిన అధినేత జ‌గ‌న్ దిద్దుబాటు చ‌ర్యలు ప్రారంబించారు.

విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌క‌ర్గాల్లో ప‌శ్చిమ నియోజ‌క‌ర్గంలోనే వైసీపీ పూర్తిగా అయోమ‌య ప‌రిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం ప‌శ్చిమ నియోజ‌క‌ర్గానికి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈయ‌న‌తో పాటు నియోజ‌కవ‌ర్గంలో మ‌రో ఇద్దరు వైసీపీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు. నియోజ‌క‌ర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న మైనారిటీ వ‌ర్గానికి చెందిన ఎంకే బేగ్, త‌రువాత మెజారిటీ ఓట్లు ఉన్న "న‌గ‌ర" సామాజిక వ‌ర్గానికి చెందిన పోతిన ప్రసాద్‌లు వెల్లంప‌ల్లితో పోటీ ప‌డుతున్నారు. ఈ ముగ్గురూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేప‌డ‌తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేది మేమే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక మ‌రో ఇండిపెండెంట్ నేత కోరాడ‌ విజ‌యకుమార్ కూడా పార్టీలో చేరి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నారు. ఈమధ్యే అయ‌న జ‌గన్‌ని క‌లిసి టికెట్ అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా వెల్లంప‌ల్లికి టికెట్ ఫైన‌ల్ కాక‌పోవ‌డంతో కోరాడ‌, పొతిన ప్రసాద్ కూడా టికెట్ కోసం గ‌ట్టి ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే కోరాడ‌కు వెల్లంప‌ల్లికి మ‌ధ్య ఉన్న విభేదాల‌ కార‌ణంగా కోరాడ నేరుగా వైసీపీ ముఖ్య నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్తూ టికెట్ ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో అధినేత ముగ్గురిలో ఎవ‌రివైపు మొగ్గు చూపుతారో చూడాలి.

విజయవాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం పరిస్ధితి చూస్తే ఇక్కడ పార్టీ బ‌ల‌హీనంగా ఉంది. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న య‌ల‌మంచ‌లి ర‌వి అంత యాక్టివ్‌గా క‌నిపించ‌డంలేద‌నేది పార్టీ అధిష్టానం అభిప్రాయం. దీనికి తోడు రాధా ద్వారా పార్టీలోకి వ‌చ్చిన ర‌వి, రాధా ఇష్యూ త‌రువాత పార్టీపై కాస్త అసంతృప్తిగా క‌నిపిస్తున్నారు. దీంతో తూర్పులో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే తూర్పు నియోజకవర్గంలోనూ గ్రూప్ రాజ‌కీయాలు మెల్లమెల్లగా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇక్కడ మాజీ ఇంచార్జ్ బొప్పన భ‌వ‌కుమార్, అడపా శేషు, ఎం.వి.ఆర్ చౌద‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు. అటు య‌ల‌మంచిలి ర‌వి పార్టీలో యాక్టివ్ గా లేక‌పోవ‌డంతో అధిష్టానం చౌద‌రి లేదా మ‌రెవ‌రైనా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ కోసం చూస్తోంది. ఇక్కడ కూడా త్వర‌లోనే నాయ‌క‌త్వం మార్చే అలోచ‌న‌లో అధిస్టానం ఉన్నట్లు తెలుస్తోంది.తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌ర్గాల‌తో పోలిస్తే సెంట్రల్ నియోజ‌క‌ర్గం కొంచెం బెట‌ర్ గానే క‌నిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మ‌ల్లాది విష్ణు ఇంచార్జ్ గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌నే ఇక్కడి నుంచే పోటీ చెయ్యబోతున్నారు. అధిస్థానం కూడా విష్ణుకు టికెట్ ఖ‌రారు చేసింది. మొన్నటి వ‌ర‌కూ రాధా, విష్ణుకు మధ్య విబేధాలు ఉన్నప్పటికీ రాధా వెళ్లిపోవ‌డంతో విష్ణుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. కానీ వంగవీటి రాధా వెళ్లిపోయిన ప్రభావం విజయవాడ సెంట్రల్ స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ విజయవాడలో ఈసారి పట్టు సాధిస్తారా అంటే కాస్త ఇబ్బంది అని చెప్పచ్చు. మొత్తానికి వైసీపీలో బెజవాడలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు జగన్ ను పరేషాన్ చేస్తున్నాయి.