//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యోగులందు రాజకీయ యోగులు వేరయా!

కమలం లో దేవతలు కూర్చుంటారు. ఇంకా, చేతిలో సిగలో కూడా ధరిస్తారు. బురదలో నుండి పుట్టినాసరే పంకిలం అంటకుండా స్వచ్ఛంగా ఉండటమే ఆ పువ్వు ప్రత్యేకత అంటుంటారు మన పురాణాల్లో. ఇప్పుడు ఆ పువ్వే గుర్తుగా కలిగిన భారతీయ జనతా పార్టీ యూపీలో తెగ వికసించింది. దాంతో ఉబ్బి తబ్బిబ్బు అయిన ఆ పార్టీ వారు ఎవరిని కమల సింహాసనం లో కూర్చోబెట్టాలో తెలియక కిందా మీద పడి చివరికి ఓ హిందూ యోగిని కమల దళ అధికార పీఠం ఫై కూర్చో బెట్టారు. భారత దేశ అతిపెద్ద రాష్ట్ర అధికార దండాన్ని ఓ హిందూ యోగికి అప్పగించి బీజేపీ నేడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రతిపక్షాలని ఐతే కాస్త ఎక్కువే ఆందోళనకే గురి చేసింది. కారణం దేశం మళ్ళీ ఎక్కడ హిందూ దేశం అయిపోతుందోనని వారి బాధ.

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగులందు రాజకీయ యోగులు వేరయా అన్నట్టు వుంటారు. గోరఖ్ పూర్ - గోరఖ్ నాథ్ మఠానికి అధ్యక్షుడైన ఆదిత్యనాధ్ మొదటినుండి క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. దేశం లో మిగిలిన మఠాలన్నీరాజకీయాలకి దూరంగా వుంటే ఈ మఠం మాత్రం గాంధీజీ కాలం నుండే దేశ రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషించింది. స్వతంత్ర సంగ్రామంలో కూడా ఈ మఠం పాల్గొంది. 1962 నుండే ఈ మఠం మహంతులు ఎమ్మెల్యులు, ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత యోగి ఆదిత్యనాథ్ కి వుంది. దశాబ్దాలుగా గోరఖ్ పూర్ లో అధికారం ఈ పీఠం అధిపతుల చేతుల్లోనే ఉంటోంది. మత సంబంధమైన కార్యక్రమాలతో పాటు రాజకీయ సామాజిక సమస్యలకి కూడా ఇక్కడ పరిష్కరిస్తుంటారు యోగి ఆదిత్యనాథ్. సమాజ సేవలో ఎప్పుడూ యోగి ఆదిత్యనాథ్ తలమునకలై వుంటారు. దేశ వ్యాప్తంగా గో సంరక్షణ నినాదాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చి దానిపై పోరాడుతున్నారు.

హిందూ యోగులవలె కాషాయ వస్త్రాలు ధరించినా వ్యవహారం లో మాత్రం ఆదిత్యనాథ్ కఠువుగానే మాటలు వదులుతారు. శాంతి సహనం మాట అటుంచి ఆయన మాటలు ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా ఉంటాయి. లవ్ జిహాద్, గోవధకి వ్యతిరేఖంగా గళం విప్పి ఆందోళనలు చేశారు ఆదిత్యనాథ్. దానివల్ల యూపీ లో మత ఘర్షణలు కూడా తలెత్తాయి. హిందూ జనాభా తగ్గిపోతోంది ముస్లిం సంఖ్య పెరిగిపోతోందంటూ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమూ ఆయనకు అలవాటే. అందుకే అక్కడ ముస్లిం వర్గాలవారికి ఆయనంటే గిట్టదు. ఇప్పుడు ఏకంగా బీజేపీ ఆయన్ని సీఎం సీటుఫై కూర్చోబెట్టింది. ఐతే ఇన్నాళ్లు స్వదేశం లో హిందువుల్ని చిన్నచూపు చూస్తూ వస్తున్న మిగిలిన పార్టీల వారికి చెంప పెట్టుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఫైర్ బ్రాండ్ గా పేరున్న యోగి ఆదిత్యానాథ్ రాష్ట్రం లో సమస్యలను తుదముట్టించడానికి తన ఫైర్ ని ఉపయోగిస్తారో లేక మత ఘర్షణలకు ఆజ్యం పోస్తారో వేచి చూడాలి. మోదీ కి ఇష్టం లేకున్నా ఆరెస్సెస్ ఆశించిన విధంగానే యూపీ సీఎం ఎంపిక జరిగినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే మోదీ-అమిత్ షాలకు సన్నిహితలైన లక్నో మేయర్ దినేష్ శర్మ, యూపీ భాజపా అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య లను ఉప ముఖమంత్రులు గా యోగి ఆదిత్యనాథ్ కు చెరోవైపు నిలబెట్టారు. అంటే పాలన అంతా మోదీ కనుసైగల్లోనే సాగేలా ఏర్పాట్లు చేశారు. మోదీ మార్గమే తన మార్గమని 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అంటున్నారు యోగి ఆదిత్యనాథ్. దేశ్ మే మోదీ, ప్రదేశ్ మే యోగి అంటూ ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ వర్గాలు, ఆయన అనుచరులు పండగ చేసుకుంటున్నారు.

ట్రిపుల్ తలాక్ పద్ధతికి వ్యతిరేఖంగా యోగి ఆదిత్యనాథ్ గళం విప్పడం తో ముస్లిం మహిళలకు ఆయనంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం అలా కొనసాగాలంటే యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రానికి ఎంతో చేయాల్సి వుంది, అదీ అందరికి సమానంగా. 2019 కేంద్రం లో బీజేపీ గెలుపు భారం యోగి ఆధిత్యనాధ్ భుజాలపై ఆ పార్టీ ఉంచింది. అందుకు ఆయన శ్రమించాల్సిన అవసరం చాలా వుంది.