కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ దేశ ప్రజలకు ట్విటర్లో ఫిట్నెస్ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. రాథోడ్ చాలెంజ్‌ను స్వీకరించిన కోహ్లీ... జిమ్‌లో తాను వర్కవుట్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. తన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్రధాని మోదీ, భార్య అనుష్క, సహచర క్రికెటర్ ధోనీలను కోరాడు. కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోదీ... తాను కూడా త్వరలోనే ఓ ఫిట్నెస్ వీడియో పోస్టు చేస్తానని పేర్కొన్నారు.
అయితే తాజాగా ఇది అటు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘విరాట్ కోహ్లీ సంధించిన సవాల్‌ను స్వీకరించడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు ఉపశమనం, దళితులు.. మైనారిటీలపై హింసను రూపుమాపేలా హామీ లాంటి సవాళ్లను కూడా మీరు స్వీకరించాలని కోరుతున్నాం. ఈ ఛాలెంజ్‌ను కూడా మీరు స్వీకరిస్తారా మోదీ సర్?’’ అని తేజస్వి ప్రశ్నించారు.