//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికారు.. ఏకంగా 2కోట్లు స‌మ‌ర్పించుకున్నారు..!

Category : state

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారుల‌ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయోద్ద‌ని ఎంత మొత్తుకుంటున్నా.. వినని వాహనదారుల నుంచి పోలీసులు ఏకంగా 2.05 కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల్లో 9516 మంది తాగి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ్డారు. వీరిలో 1699 మందికి 2 నుంచి 30 రోజల వరకు జైలు శిక్ష విధించారు. జరిమానాల రూపేణా 2.05 కోట్లు వసూలు చేసిన‌ట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

మార్చిలో 1602 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌లో ఆ సంఖ్య 2,550కి పెరిగింది. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) ఎక్కువగా ఉన్న, రెండుసార్ల కన్నా ఎక్కువగా పట్టుబడిన 45 మంది లైసెన్స్‌లను కోర్టు రద్దు చేసింది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్‌పోర్టు వెరిఫికేషన్, వీసా క్లియరెన్స్ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నమోదైన కేసుల్లో పోలీసులు ఇప్పటి వరకు 9648 చార్జిషీట్లు దాఖలు చేశారు. వీటిలో 681 మంది లైసెన్స్‌లను కోర్టు సస్పెండ్ చేయ‌గా, 69 లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేసింది. కేసులు నమోదవుతున్నా, లైసెన్స్‌లు రద్దవుతున్నా, జరిమానాలు విధిస్తున్నా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు మాత్రం ఆగకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.