//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలవరం రిపోర్ట్..పోలవరానికి భద్రత పెంచండి

Category : state

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసారు. వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఉంచాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైనందున ఎలాంటి అవరోధాలూ లేకుండా శత్రుదుర్భేద్యంగా మార్చాలని, పనుల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని..

జల వనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకూ 51.1 శాతం ప్రాజెక్టు పూర్తయిందని, కుడి ప్రధాన కాలువ 89.1శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌కు సంబంధించి తవ్వకం పనులు 71.10 శాతం, కాంక్రీట్‌ పనులు 13.8శాతం..

డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం 79.40శాతం, జెట్‌ గ్రౌటింగ్‌ 68.06 శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 68శాతం పూర్తయిందని వివరించారు. గతవారం రోజుల్లో 1.93లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు, 21వేల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని, 38.4 మీటర్ల వరకూ డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టులో మొత్తమ్మీద 1,116.59 లక్షల క్యూబిక్‌ మీటర్లకు గాను..ఇప్పటి వరకూ 793.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకూ కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటికే 4.96 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకూ నిర్మాణం జరిగిందని తెలిపారు. రేడియల్‌ ఫ్యాబ్రికేషన్‌ 18వేల మెట్రిక్‌ టన్నులకు గాను 10,450 మెట్రిక్‌ టన్నుల వరకూ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇక నిధుల విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ మొత్తం రూ.13,364.98 కోట్లు ఖర్చు చేశామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.8229.11 కోట్లు వ్యయం చేశామని అధికారులు వివరించారు.ఇందులో రూ.5342.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసిందని, మరో రూ. 2886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు.

Related News