భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కులీన వర్గానికి చెందిన వ్వక్తి అయితే 14వ ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ మాత్రం ఒక నిరుపేద కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త కావడం విశేషం. చిన్నతనంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌కి 80 కి.మీ దూరంలో ఉన్న వద్‌నగర్ రైల్వే స్టేషన్లో తండ్రికి తోడుగా టీ అమ్మిన మోడీ కాల క్రమంలో దేశ ప్రధాని కాగలిగారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని ఈ ఘటన ప్రపంచానికి చాటింది. ధార్మిక ఆలోచనలు, భక్తి భావంతో ఉండే మోడీ చిన్ననాడే ఆర్ ఎస్ ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు. 18 ఏళ్ళకే పెళ్ళయినా సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళి మూడేళ్ళు గడిపి వచ్చారు. ఆ తర్వాత ఇంటికి వచ్చినా ఒక్కరోజు కూడా ఉండకుండా అహ్మదాబాద్ వెళ్ళి చిన్ననాటి ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ వద్దకు వెళ్ళి సంఘ్‌లో పనిచేయాలన్న కోర్కె వెలిబుచ్చారు నరేంద్ర మోడీ. సంఘ్లోను..బీజేపీ విద్యార్థి సంఘంలోనూ అంచెలంచెలుగా ఎదిగిన మోడీ గుజరాత్ రాష్ట్రంలో ఒక నాయకుడిగా రూపొందుతున్న తరుణంలో పార్టీలో తలెత్తిన విభేదాలు 1995లో మోడీని గుజరాత్ నుంచి ఢిల్లీకి చేర్చాయి. అక్కడ అగ్రనేతలైన వాజ్‌పేయి, ఎల్కే అద్వానీలతో సాహచర్యం, పార్టీ పట్ల విధేయత కారణంగా ఉత్తరాదిన ఐదు రాష్ర్టాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ళ పాటు సొంత రాష్ట్రానికి దూరంగా ఢిల్లీలో ఉన్న మోడీ అవకాశం కోసం ఎదురుచూశారు.
మోడీ ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి.2001లో సంభవించిన గుజరాత్ భూకంపం సందర్భంగా కేశూభాయ్ పటేల్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం సరిగా పనిచేయలేదని విమర్శలొచ్చాయి. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో...ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీని గుజరాత్‌కి పంపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టారు నాటి ప్రధాని వాజ్‌పేయి, ఉప ప్రధాని అద్వానీ. ఈ హఠాత్పరిణామంతో మోడీ ఇక వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా పోయింది. ఏ ఘటన జరిగినీ అది మోడీకి మేలే చేసింది. ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్‌గా ఉన్న ఒక వ్యక్తిని, అదీ ఎమ్మెల్యే కూడా కాని, ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తిని గుజరాత్ వంటి రాష్ర్టానికి ముఖ్యమంత్రిని చేయడం నాటి బీజేపీ నాయకత్వం చేసిన అతి గొప్ప సాహసం.
2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2004 ఫిబ్రవరిలో రాజ్‌కోట్ ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనం, దానికి ప్రతీకారంగా గోద్రా అల్లర్లు ప్రారంభమయ్యాయి. వందలాది మంది ఊచకోతకు కారణమైన నాటి మారణకాండ అంతర్జాతీయంగా గుజరాత్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసాయి. మోడీకి అమెరికా వీసా కూడా నిరాకరించింది. ప్రధాని వాజ్‌పేయి బహిరంగంగానే మోడీ రాజీనామా చేయాలని సూచించారు. మోడీ రాజధర్మాన్ని విడనాడారని విమర్శించారు. అదే సమయంలో అద్వానీ మాత్రం మోడీకి అండగా నిలిచారు. సంఘ్ నాయకత్వం కూడా మోడీని ఏమీ అనలేదు. ఇక మోడీ ఎవరినీ లెక్కచేయలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఆరు నెలల ముందుగానే వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం సాధించిపెట్టి మళ్ళీ సీఎం కాగలిగారు. ఇక గుజరాత్‌ను అభివృద్ధి బాట పట్టించారు. తనను నిందించినవారి నోటితోనే పొగిడించుకున్నారు. అమెరికా పిలిచి వీసా ఇచ్చేపరిస్థితి కల్పించారు. గుజరాత్లో పార్టీని మూడు సార్లు గెలిపించడం, అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ రెండుసార్లు ఓటమి చెందడంతో అద్వానీ నాయకత్వం పట్ల ఆర్ ఎస్ ఎస్ అగ్రనేతలు కినుక వహించారు. 2012లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్ స్వయంగా నరేంద్రమోడీకి 2014 ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అద్వానీ అలిగినా, బెదిరంచినా వినని ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం మోడీనే ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ప్రకటన చేసింది. దీంతో క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన రాజకీయ గురువు అద్వానీ రాజకీయ జీవితానికి మోడీ ఆ విధంగా స్వస్తి పలికారు.
పదమూడేళ్ళ పాటు గుజరాత్ సీఎంగా పెట్టుబడిదారుల సాహచర్యం చేసిన నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో కార్పొరేట్ సంస్థ తరహాలో ప్రచారం చేశారు. బీజేపీకి గతంలో ఎన్నడూ తెలియని, ఊహించని ఘనవిజయాన్ని రుచి చూపించారు. ప్రధాని పీఠం ఎక్కారు. ఇక అప్పటినుంచీ బీజేపీలో మోడీ శకం మొదలైంది. తొలితరం నాయకులను పదవులకు దూరం చేశారు. తన సహచరుడు, మిత్రుడు అమిత్‌షాను పార్టీ చీఫ్‌గా నియమించారు. దేశంలో ఒక దేశం-ఒక పార్టీ నినాదాన్ని అందుకున్న మోడీ, అమిత్ ద్వయం ఒకదాని తర్వాత ఒక్కటిగా 17 రాష్ర్టాల్లో కాషాయ జెండాను రెపరెపలాడిస్తున్నారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లో సాధించిన అఖండ విజయంతో అక్కడ ఆధిత్యనాధ్ అనే ఒక సన్యాసిని ముఖ్యమంత్రిగా నియమించారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి ఒక ప్రణాళక ప్రకారం ముందుకు సాగుతున్నారు మోడీ, అమిత్‌లు. అందులో భాగంగానే దళితులపై దాడులు, గో మాంసం నిషేధం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిని తట్టుకోవడానికే దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్‌కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎంపిక చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మోడీపై ఎన్నెన్నో విమర్శలు వస్తున్నాయి.
అప్పడప్పడు ఇండియా వచ్చే మోడీ ఎప్పుడూ విదేశాల్లోనే గడుపుతున్నారని విమర్శకులు అంటున్నారు. ఈ మూడేళ్ళ కాలంలో మోడీ ఆరు ఖండాల్లోని 49 దేశాల్లో పర్యటించి వచ్చారు. దేశమంతా కాషాయ జెండాను రెపరెపలాడించాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. అదే సమయంలో గతంలో తానే వ్యతిరేకించిన ఒక దేశం ఒక పన్ను విధానాన్ని తెరమీదకు తెచ్చి పార్లమెంట్లో ఆమోదింపచేసి జీఎస్టీని అమలులోకి తీసుకువచ్చారు మోడీ. ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. ఒకదాని తర్వాత మరో రాష్ట్రంలో పాగా వేస్తున్న బీజేపీ తాజాగా బిహార్ ప్రభుత్వంలో కూడా చిచ్చు పెట్టింది. లాలూప్రసాద్ యాదవ్ నుంచి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ని దూరం చేసింది. లాలూ ప్రసాద్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల శిబిరం నుంచి నితీష్‌ను బయటకు తెచ్చి తన మద్దతుతో నితీష్ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయబోతోంది. దీనికంతా సూత్రధారి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని వేరే చెప్పక్కర్లేదు.