మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఈ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ.
ఉగ్రదాడి నేపధ్యంలో ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. రైలు యొక్క ప్రత్యేకతను పీయూష్ గోయల్ ను , అధికారులను అడిగి తెలుసుకున్నారు మోడీ. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లుంటాయి.
ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. తాజా వంటకాలను ప్రయాణీకులకు అందించేందుకు ప్రతి కోచ్‌లో పాంట్రీని ఏర్పాటు చేసినట్టు వారు ప్రధానికి వివరించారు. కాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూపొందించడం వెనుక డిజైనర్లు, ఇంజనీర్ల కృషిని అభినందించారు.