ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వారి కన్నా నేను 50 రెట్లు అధికంగా క్రూరుడిని.. వాళ్లు తలలు మాత్రమే నరికుతారు... నాకు ఉగ్రవాదులు సజీవంగా దొరికితే మాత్రం వాళ్లను తినేస్తా’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. తమ దేశంలో ప్రారంభమైన క్రీడా టోర్నమెంట్ వేడుకలో పాల్గొన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సృష్టిస్తోన్న బీభత్సం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో తీవ్ర ఆందోళన కలుగజేయడానికి ఉగ్రవాదులు తలలు నరికేస్తున్నారని, అయితే, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఉగ్రవాదులను కాల్చిపారేయాలని రోడ్రిగో.. తమ సైనికులకు సూచించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానని వ్యాఖ్యానించిన ఆయన... ఉగ్రవాదులను సజీవంగా తనకు అప్పగిస్తే మాత్రం కాస్త ఉప్పు, వెనిగర్ పట్టించి, వాళ్ల లివర్ ను తినేస్తానని అన్నారు. ఉగ్రవాదం అంశాన్ని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.