పిలిప్పీన్స్ బ్యాంక్‌లో గందరగోళం ఏర్పడింది. ఆ దేశానికి చెందిన బీపీఐ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో సొమ్ము విత్‌డ్రా అయ్యింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే డబ్బు విత్‌డ్రా అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆన్లైన్ అకౌంట్లు ఉన్న ఖాతాదారులు తమ అకౌంట్లను వాడలేని పరిస్థితి తలెత్తింది. బీపీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్లు తమ డబ్బు పోయిందంటూ లబోదిబోమంటున్నారు. దీంతో ఆ దేశ సోషల్ మీడియాలో బ్యాంక్ లావాదేవీలపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నల్ డేటా ప్రాసెసింగ్ లోపం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అకౌంట్ బ్యాలెన్స్ కూడా తప్పుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ ఖాతాల నుంచి సొమ్ము పోయిందంటూ కొందరు కస్టమర్లు బ్యాంకుల ముందు బారులు తీరారు. కొన్ని అకౌంట్లలో రెండు మూడు సార్లు డబ్బు డెబిట్, క్రెడిట్ అయినట్లు చూపిస్తున్నాయి. బీపీఐ బ్యాంక్‌ను హ్యాకర్లు టార్గెట్ చేసి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది హ్యాకింగ్ కాదు అని, అంతర్గత సమస్య వల్ల ఈ సమస్య వచ్చినట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. పదల సంఖ్య నుంచి లక్షల పీసోలు(పిలిప్పీన్స్ కరెన్సీ) తమ ఖాతా నుంచి మాయమైనట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు.ఫలితంగా మనీలా స్టాక్ మార్కెట్లలో బీపీఐ షేరు ఒక శాతం కుంగింది.