పెట్రోలు ధరల రోజువారి సవరణల వ్యవహారం పెట్రోల్ బంక్ యాజమాన్యాల పాలిటి వరంగా మారుతోంది. రోజువారి ధరలను ఆసరాగా చేసుకుని నగరంలోని కొన్ని పెట్రోల్ బంక్‌ల యాజమాన్యాలు వాహనదారులను విభిన్న రకాలుగా నిలువుదోపిడీ చేస్తున్నాయి. దోపిడీకి కాదేది అనర్హం అనేలా వారు మోసాల కు పాల్పడుతున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రవేశ పెట్టిన రోజువారి ధరల నిర్ణయాన్ని కొన్ని పెట్రోలు బంక్‌ల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ధరల మార్పుకు చేపట్టే సవరణల సమయంలో మీటర్ రీడింగ్‌లను కూడా మార్పు చేస్తూ అంది నకాడికి దోచుకుంటున్నారని మెహిదీపట్నం ,లంగర్‌హౌస్, టోలీచౌకి, నానల్‌నగర్, రేతిబౌలి, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి తదితర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ధరలతో పాటు మీటర్ సెట్టింగ్ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచిన ప్రతిసారి నగరంలోని పలు పెట్రోలు బంక్‌లు మోసాలకు పాల్పడుతున్నయానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోలు కొత్త ధరలు మార్చే క్రమంలో మీటర్ రీడింగ్‌లను సెట్టింగ్ చేసి దోచుకుంటున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోలు ధరల విషయంలో వాహనదారులకు సరైన అవగాహన లేకపోవడం కూడా బంక్‌ల వారికి వరంగా మారుతుంది. పెట్రోల్ ధరలను చూసుకుని పెట్రోల్ పోయించుకునేవారు మీటర్‌ను గమనించే లోపే అది గిర్రున తిరిగి తక్కువ పెట్రోల్ వస్తుందని లంగర్‌హౌస్, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం ప్రాంతాల ప్రజలు అంటున్నారు.
రూ.300ల పెట్రోల్ పోయించుకుంటే రూ.270 లపెట్రోల్ మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లంగర్‌హౌస్‌లోని ఓ పెట్రోల్ బంక్ లో 5 లీటర్ల పెట్రోల్ పోయిస్తే సుమారు అర్ధ లీటర్ కన్నా తక్కువ పెట్రోల్ పోశారని జాన్కెన్నెడీ అనే వ్యక్తి వాపోయారు. మోసాలకు పాల్పడుతున్న బంకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. పౌరసరఫరా అధికారులు దాడులు చేపట్టాలి పెట్రోల్ బంక్‌ల్లో రోజువారి ధరల సవరణల ప్రకారం పెట్రోల్ పోయడం లేదన్న ఫిర్యాదులపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి దాడులు చేపట్టాలని ప్రజలు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉత్త మ పాలనను అందించడానికి చర్యలు తీసుకుంటున్నా అధికారులు చిత్తశుద్ధ్దితో పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల లంగర్‌హౌస్, టోలీచౌకి, నానల్‌నగర్, రేతిబౌలి, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి ప్రాంతాల్లో పలు పెట్రోల్ బంక్‌ల దోపిడీ బాగా పెరిగిపోయిందని, దీంతో తాము చాలా నష్టపోతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి పెట్రోల్ బంక్‌ల యాజమాన్యాల దోపిడీని నిలువరించాలని వాహనదారులు కోరుతున్నారు.