పేటీఎం సంస్థ సీనియర్ ఉద్యోగులకు ఊహించని అదృష్టం తలుపుతట్టింది. సంస్థ షేర్లను చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా రూ.100కోట్లకు కొనుగోలు చేయడంతో.. కంపెనీలోని సీనియర్ ఉద్యోగులు ఒక్కసారిగా కోటీశ్వరులైపోయారు. మొత్తం వెయ్యి మంది ఉద్యోగుల్లో 47మంది ఉద్యోగులు తమ షేర్లు అమ్మడానికి మొగ్గుచూపగా.. వారందరికీ రూ.2కోట్ల చొప్పున దక్కనున్నాయి.
నోయిడాలోని పేటీఎం సంస్థలో పనిచేస్తున్న 47మంది ఉద్యోగులు గతంలో వన్ 97 కమ్యూనికేషన్స్ లో షేర్స్ కొన్నారు. ప్రారంభంలో వీటివల్ల తమకొచ్చే లాభమేమి లేదని ఉద్యోగులు ఉసూరుమన్నారు. కానీ అలీబాబా సంస్థ రూ.100కోట్ల మొత్తంతో తమ షేర్స్ ను కొనుగోలు చేయడంతో తమ పంట పండిందని భావిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం సంస్థలో ఉద్యోగులు 4శాతం షేర్ కలిగి ఉన్నారు.