//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫలవంతంగా ముగిసిన 'పార్లమెంట్ వర్షాకాల' సమావేశాలు

Category : national


పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొత్తంగా ఫలవంతమైన చర్చలతో శుక్రవారంతో ముగిశాయి. జులై 17న ప్రారంభమైన సమావేశాలు ఆగస్టు 11 వరకు జరిగాయి. మొత్తం 26 రోజుల్లో ఐదు రోజులు సెలవు దినాలు పోనూ 19 రోజుల పాటు పార్లమెంట్‌ సభలు జరిగాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, దళిత, మైనార్టీలపైన దాడులు, విదేశాంగ విధానం వంటి అంశాలపై చర్చ జరిగింది.

ఈ సమావేశాల్లో ఉభయ సభలో 23 బిల్లులు ఆమోదం పొందాయి. ఈసారి మొత్తం 17 బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 14 బిల్లులు, రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం పొందాయి. మూడు బిల్లులను ఉపసంహరించారు. మోటార్‌ వెహికల్‌ చట్టానికి సంబంధించిన బిల్లును ఎంపిక (సెలెక్టు) కమిటీకి పంపించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, వివిధ రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో దీన్ని సెలెక్టు కమిటీకి ప్రతిపాదిస్తూ రాజ్యసభ నిర్ణయం తీసుకొంది.

లోక్‌సభలో 193 రూల్‌ కింద దేశంలో వ్యవసాయ సంక్షోభం, దళిత, మైనార్టీలపై గోరక్షక్‌ దాడులు అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగగా, రాజ్యసభలో 176 రూల్‌ కింద దేశంలో రైతాంగ సంక్షోభం, దళిత, మైనార్టీలపై గోరక్షక్‌ దాడులు, విదేశీ విధానం అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. లోక్‌సభలో దేశంలో ఇటీవల వచ్చిన వరదలు, ప్రభుత్వ సాయంపైన, రాజ్యసభలో వరదలు, మత్య్సకారులపై ప్రభుత్వ చర్యలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ జరిగింది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలతో సంతృప్తి వ్యక్తం చేశాయి. వివిధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగానే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగడం, కొత్తగా ఎన్నికైన వారు పదవీ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగింది.

ఈ ఎన్నికల కారణంగా మరిన్ని అంశాలపై చర్చలకు అవకాశాలు కలుగలేదు. కాగా,  ఆగస్టు 9న 75 ఏళ్ల క్విట్‌ ఇండియా ఉద్యమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా 2022 నాటికి నూతన భారతదేశం కోసం ''సంకల్ప సిద్ధి'' ప్రతిజ్ఞను అన్ని పార్టీలు చేశాయి. మధ్యంతర గ్రాంట్ల కోసం డిమాండ్లు 2017-18 (రైల్వే కూడా), అదనపు గ్రాంట్ల కోసం డిమాండ్లు 2014-15, అనుబంధ వినియోగ బిల్లులపై లోక్‌సభలో చర్చించి ఆమోదించారు. ఈ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టి, 14 రోజుల్లో ఆమోదం పొందవలసి ఉన్న, ఆ విధంగా జరగని పక్షంలో రాజ్యాంగంలోని 109(5) ఆర్టికల్‌ ప్రకారం లోక్‌సభ ఆమోదించిన ఆర్థికపరమైన బిల్లును రాజ్యసభ ఆమోదించనట్లే పరిగణిస్తారు.

వివిధ అంశాలపై మంత్రులు ఈ సమావేశాల్లో 41 ప్రకటనలు చేసినట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు. మొత్తం 1217 నివేదికలను ప్రవేశపెట్టారు. ఒక ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై కూడా చర్చ జరిగింది. జీరో అవర్‌లో 252 నోటీసులు జారీ అయ్యాయి. సభా సమయంలో చర్చలు చేపట్టాలని 42 వాయిదా తీర్మానాలు రావడంతో, వాటన్నింటిని తిరస్కరించినా వాటి వల్ల సభ 30 గంటల సమయాన్ని కోల్పోయింది. అందరు ఎంపీలు దాదాపు 57 గంటల పాటు మాట్లాడారు.