Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబుకు ట్విస్ట్ ఇచ్చిన పరిటాల సునీత ... తాను పోటీలో లేనని సంచలనం

Category : politics state

ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది .ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అనంతపురం రాజకీయాలలో కీలక భూమిక పోషించే మంత్రి పరిటాల సునీత ఈసారి తాను పోటీలో ఉండడం లేదని, తన స్థానంలో తన కుమారుడు శ్రీరామ్ ఆదరించాలని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు కి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల సునీత వ్యాఖ్యలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేందుకు ఆమె విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. నిన్న, మెున్నటి వరకు రెండు సీట్లు కావాలంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చిన సునీత్ అనూహ్యంగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీలోని నేతలంతా చంద్రబాబు నాయుడు వద్ద తేల్చుకుని ప్రచారం చేస్తుంటే పరిటాల సునీత మాత్రం బుధవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించి తన కుమారుడుని ఆశీర్వదించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను ఇప్పటి వరకు ఆదరించారని అలాగే తన తనయుడు శ్రీరామ్ ను కూడా ఆశీర్వదించి అండగా ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. తమ కుటుంబం, పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధినేతకు చెప్పామని ఆమె తెలిపారు. తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని చంద్రబాబును కోరామని అలా వీలుకాని పక్షంలో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు. ఇప్పటికే రాప్తాడు టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీతను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే తానూ కాదు తన బదులు తన కుమారుడు బరిలో ఉంటాడని సునీత చేసిన ప్రకటన చంద్రబాబుకు షాక్ ఇచ్చింది.

అయితే మంత్రి తన తనయుడు బరిలో ఉంటారంటూ ఎన్నికల ప్రచారం చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీటుపై తేల్చుకునేందుకు గురువారం సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ తో కలిసి ఉండవల్లిలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సునీత అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం తనయుడు శ్రీరామ్ ను బరిలోకి దించడం వెనుక అసలు కారణం ఏమిటో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.