పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (210 నాటౌట్; 156 బంతుల్లో 24×4, 5×6)కు పూనకం వచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేశాడు. సిక్స్‌లు ఫోర్లతో చెలరేగి విధ్వంసం సృష్టించాడు.
అతనితో పాటు ఇమాముల్ హక్ (113; 122 బంతుల్లో 8×4) రాణించడంతో బులవాయో మైదానం చిన్నబోయింది.. రికార్డులు బద్దలయ్యాయి. శుక్రవారం నాలుగో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. జింబాబ్వే బౌలర్లను ఎడాపెడా బాదిన జమాన్, హక్ తొలి వికెట్‌కు ఏకంగా 304 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
అర్ధసెంచరీని 51 బంతుల్లో, సెంచరీని 92 బంతుల్లో పూర్తి చేసుకున్న జమాన్.. ఆ తర్వాత కేవలం 52 బంతుల వ్యవధిలోనే రెండో శతకాన్ని బాదేశాడు. ఫోర్లతోనే ఎక్కువగా పరుగులు పిండుకున్న జమాన్... 115 బంతుల్లో 150, 148 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. తిరిపానో బౌలింగ్‌లో బౌండరీ కొట్టి పాక్ తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సయ్యద్ అన్వర్ 194 రికార్డును అందుకున్న జమాన్.. ఆ తర్వాత బంతికే మరో ఫోర్‌తో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ముజరంబాని బౌలింగ్‌లో బౌండరీతో జమాన్ ద్విశతకం పూర్తయింది. ఆఖర్లో అసిఫ్ అలీ (50 నాటౌట్; 22 బంతుల్లో 5×4, 3×6) మెరుపులతో పాక్ భారీ స్కోరు చేసింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే (399) అత్యధిక స్కోరు. ఛేదనలో జింబాబ్వేను 155 పరుగులకే ఆలౌట్ చేసిన పాక్.. 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది.