చాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థి శ్రీలంకపై తమ విజయ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ పాకిస్థాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ నంబర్‌వన్ దక్షిణాఫ్రికాపై గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో శ్రీలంక భరతం పట్టింది.
సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ సేన 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని పాక్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ సర్ఫరాజ్(79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు), ఫకర్(50) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నారు. ప్రదీప్ (3/60) మూడు వికెట్లు తీశాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 236 పరుగులకు ఆలౌటైంది. డిక్వెల్లా(73) అర్ధసెంచరీతో రాణించాడు. జునైద్, అలీ మూడేసి వికెట్లు పడగొట్టారు. జట్టుకు అద్భుత విజయాన్నందించిన సర్ఫరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాక్ తలపడుతుంది.