ఆఫ్రో టీ20 కప్లో ఆడేందుకు ఉగాండా వెళ్లిన పాక్ క్రికెటర్లు అక్కడ చిక్కుకుపోయారు. ఈ టోర్నీలో ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డుతో ఉగాండా బోర్డు ఒప్పందం చేసుకుంది. దీంతో అనుకున్న ప్రకారం 20 మంది పాకిస్థాన్ టాప్ క్రికెటర్లు ఉగాండాలోని కంపాలా చేరుకున్నారు. అయితే అలా వెళ్లిన క్రికెటర్లకు అక్కడ చుక్కలు కనిపించాయి. ఉగాండాలో అడుగుపెట్టాక పేమెంట్ సమస్యల కారణంగా లీగ్ రద్దు చేసినట్టు తెలియడంతో పాక్ క్రికెటర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మొదటి రెండు రోజుల మ్యాచ్లు రద్దు కావడంతో పాక్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాంట్రాక్టు ఫీజులో కనీసం 50 శాతం అయినా ఇవ్వాలని ఉగాండా క్రికెట్ అసోసియేషన్ను డిమాండ్ చేశారు. అయితే ఆర్గనైజర్లు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించారు. లీగ్ రద్దు కావడతో తాము వెంటనే పాకిస్థాన్ వెళ్లిపోదామనుకున్నామని, అయితే ఆర్గనైజర్ డబ్బులు చెల్లించకపోవడంతో విమాన సంస్థ టికెట్లను రద్దు చేసిందని ఓ క్రికెటర్ తెలిపాడు.
ఫలితంగా అక్కడ ఉండలేక, తిరిగి వెళ్లే వీలు లేక నరక యాతన అనుభవించినట్టు పేర్కొన్నాడు. చివరికి పాక్ క్రికెట్ బోర్డును, ఉగాండాలోని పాక్ ఎంబసీని సంప్రదించామని, శనివారం నాటికి స్వదేశం చేసుకుంటామని అతడు పేర్కొన్నాడు. డబ్బులు సంపాదించడానికి వస్తే తిరిగి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పీసీబీ తెలిపింది.