చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన ఇంగ్లండ్ జట్టుకు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా కీలక మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో వెనుకడుగు వేసింది. దీంతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి దర్జాగా టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.
ఇంగ్లాండ్ విధించిన 212 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 37.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి అవలీలగా ఛేదించింది. లక్షసాధనలో పాక్ ఓపెనర్లు అజార్ అలీ (76 పరుగులు, 100 బంతుల్లో సిక్స్, 5 ఫోర్లు), ఫఖార్ జమాన్ (57 పరుగులు, 58 బంతుల్లో సిక్స్, 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించింది.
తరువాత బాబార్ అజామ్ (38 పరుగులు, 45 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లు), మహమ్మద్ హఫీజ్ (31 పరుగులు, 21 బంతుల్లో రెండు సిక్స్‌లు, 3 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్ దెబ్బకు విలవిలాడింది. ఇంగ్లాండ్ జట్టులో ఒక్కరూ కూడా అర్ధ శతకం సాధించలేకపోయారు.
ఓపెనర్ జానీ బెయిర్ స్టో (43 పరుగులు, 57 బంతుల్లో నా లుగు ఫోర్లు), జో రూట్ (46 పరుగులు బంతుల్లో రెండు ఫోర్లు) త్రుటిలో అర్ధ శతకాలు చేజార్చు కొన్నారు. బెయన్ స్టోక్స్ (34 పరుగులు, 64 బంతులు), ఇయాన్ మోర్గాన్ (33 పరుగులు, 53 బంతుల్లో నాలుగు ఫోర్లు) ఫరవాలేదనిపించారు.
బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి 5 ఓవర్లలో 29 పరుగులు చేసింది. తరువాత ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న పాక్ ఆటగాడు రుమాన్ రాయిస్ బౌలింగ్‌లో హేల్స్ (13 పరుగులు) బాబర్ అజమ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే మొదటి వికెట్‌ను సాధించిన ఘనతను రాయిస్ సొంతం చేసుకున్నాడు. ఈ తరువాత నుంచి ఇంగ్లాండ్ కోలుకోలేక పోయింది.