హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ఆరు రోజుల క్రితం ప్రకటించినా పాకిస్తాన్ లెక్కచేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చలకు ముందు ఈ ప్రకటన వెలువడింది.
సలాహుద్దీన్‌తో పాటు, హిజ్బుల్ ముజాహిదీన్‌పై పెరుగుతున్న ఆంక్షలను పాకిస్థాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ముజఫరాబాద్‌లో వందలాది జనం సలాహుద్దీన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో ఉగ్రవాదంపై పోరాటంపై పాకిస్థాన్‌కు ఉన్న నిబద్ధత ప్రశ్నార్థకమవుతోంది.
సలాహుద్దీన్ నేతృత్వంలోని హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో దాని కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నాయి. సలాహుద్దీన్ స్థానిక ఉగ్రవాదే. అయితే పాకిస్థాన్ ప్రాపకంతో నియంత్రణ రేఖ అవతల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.