వెనిజులా సుప్రీంకోర్టుతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై బుధవారం బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే కదా. ఈ దాడి వెనుక ఉన్నది ఓ యాక్షన్ ఫిల్మ్ స్టార్ అని తేలింది. ఆస్కార్ పెరెజ్ అనే ఆ వ్యక్తి.. తనకు తాను జేమ్స్ బాండ్‌గా, రాంబోగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నాడు. అతడో పైలట్, డైవర్, పారాషూటిస్ట్ అని.. ఈ దాడులకు పెరెజే బాధ్యుడని అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. తాను ఓ నిరంకుశ, కిరాతక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఆస్కార్ పెరెజ్.. సోషల్ మీడియాలో వెల్లడించాడు. 2015లో రిలీజైన వెనిజులియన్ యాక్షన్ మూవీ సస్పెండెడ్ డెత్‌లో పెరెజ్ నటించాడు. ఈ మూవీకి డైరెక్టర్ కూడా అతడే. అందులోనూ నిన్న సుప్రీంకోర్టుపై దాడి జరిగినట్లే ఉండే సీన్స్ ఉంటాయి.
వెనిజులాలో కొన్నాళ్లుగా తీవ్ర సంక్షోభం నెలకొంది. లక్షల మంది ఆందోళనకారులు మాడ్యురోకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, కరెన్సీ విలువ పడిపోతుండటం.. తినడానికి తిండి కూడా సరిగా దొరకని పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఆందోళనలను మాడ్యురో ప్రభుత్వం అణచివేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పెరెజ్.. ఈ దాడికి పాల్పడ్డాడు. ఫ్రీడమ్ అన్న బ్యానర్‌ను హెలికాప్టర్‌కు కట్టుకొని పెరెజ్ ఈ దాడులు చేశాడు. అతని వెనుక ఎవరున్నారన్నదానిపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది.