//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోరక్షకులకు మోడీ హెచ్చరికలను కొట్టిపారవేసిన వివక్షాలు

Category : national

ప్ర‌ధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన సందర్భంగా గో రక్షకులకు చేసిన హెచ్చరికలను ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు.  కేవలం నోటి మాటలకే సరిపెట్టకుడదని, చేతల్లో చూపించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు. గో రక్షకులను హెచ్చరించడం కేవలం నోటి మాటలేనని ఎద్దేవా చేశారు.  

ప్రధాని హెచ్చరిక చేసిన కొద్దీ సేపటికే ఝార్ఖండ్ లో గో రక్షకులు గో మాంసం తీసుకు వెళ్తున్నారన్న అనుమానంపై ఒకరిపై దాడిచేసి చంపి వేయడంతో మోడీ మాటలకు విలువలేదని స్ఫష్టమైనది. చేతలు శృతి మించిపోతే ఇక నోటి మాటలకు ఏమి విలువ ఉంటుందని రాహుల్ గాంధీ పెదవి విరిచారు. మోడీ ప్రకటన చాలా ఆలస్యమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఓ వైపు గో రక్షకులను రెచ్చిగొట్టి మరోవైపు నోటి మాటలతో చేసే ఇలాంటి హెచ్చరికలకు ఎలాంటి విలువ ఉండదని ఆయన విమర్శించారు.

కేవలం మాటలు  సరిపోవని గో రక్షకుల హింసను కట్టడి చేయాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో నేడు దేశంలో ఒక భయానక వాతావరణం నెలకొన్నదని, ఎవ్వరు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి నిరంకుశ పాలన సాగుతున్నదని అంటూ ఎమర్జెన్సీ నాటికన్నా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

గో రక్షకులకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నంత వరకు సమాజంలో హింస ఆగదని ఒవైసీ స్పష్టం చేసారు. గోవుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినంత కాలం గో రక్షకులు మనుషులను కొట్టి చంపుతారని పేర్కొన్నారు. రెండోసారి ప్రధాని ఈ విధంగా మాట్లాడుతున్నా పరిస్థితులలో మార్పు ఉండటం లేదని, చాల దాడులు ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలకు చెందిన వారే, ముఖ్యంగా బీజేపీకి పాలిత రాష్ట్రాలలో చేస్తున్నారని గుర్తు చేశారు. పెదాలపై సానుభూతి చూపడం వల్లన ప్రయోజనం ఉండబోదని అంటూ మైనార్టీలను కొట్టి చంపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు.