పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రైవేట్ వారిని వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న సమయంలో తన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మార్గాలు అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా దేశీయ విమానాల్లోని ఎకామనీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని తెలిపింది. కేవలం శాఖాహారం మాత్రమే అందిస్తామని పేర్కొంది. అయితే ఎయిరిండియా అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.
‘గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించట్లేదు. దీని వల్ల ఎయిర్ ఇండియాకు ఏడాదికి రూ.7 నుంచి 8కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎయిర్ ఇండియా అప్పులు రూ 53 కోట్లకు పేరుకు పోవడంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వచ్చే సంవత్సరం ప్రారంభం లోగా ఎయిర్ ఇండియాలోని కొన్ని వాటాలను అమ్మేయాలని నిర్ణయించింది.
అయితే ప్రవేటీకరణ పట్ల ఉద్యోగులలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘం బీజేపీ సన్నిహితమైన బియంయస్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం.ఎయిర్ ఇండియాను కాపాడేందుకు కొందరు సంస్థ ఉద్యోగులు చొరవ తీసుకొనే నిర్వహణ ఖర్చులు తగ్గించుకొనే మార్గాల వైపు దృష్టిి సారిస్తున్నారు. గత నెల్లో క్యాబిన్ సిబ్బంది ఒకరు ఎయిర్ ఇండియాకు ఈ ప్రణాళికల గురించి ఇంటర్నల్ మెయిల్ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
‘కొన్ని అంతర్జాతీయ విమానాల్లో సలాడ్లు వృథా అవుతున్నాయి. కేవలం 20శాతం ప్రయాణికులు మాత్రమే సలాడ్లను తీసుకుంటున్నారు. అందుకే అంతర్జాతీయ విమానాల్లో సలాడ్లను ఇవ్వడం నిలిపివేస్తే బాగుంటుంది. ఇక, ఎయిరిండియా మ్యాగజైన్ `శుభ్ యాత్ర’ను కూడా ప్రతి సీటు ముందు కాకుండా ఒక ర్యాక్ ఏర్పాటుచేసి అందులో 25 కాపీలు ఉంచితే సరిపోతుంది’ అని సదరు సిబ్బంది మెయిల్లో పేర్కొన్నారు.