భారతదేశంలో పౌరులు మూడు నెలల ముందు వరకే రైల్వే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంది. అయితే దేశంలో పర్యటించాలనుకునే విదేశీయులకు మాత్రం ఏడాది ముందుగానే రైలు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వేస్ కల్పించనున్నారు. మరో వారంలో సంబంధిత ప్రకటన వెలువడనుంది. విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులను ఆకర్షించడమే ప్రధాన రైల్వేస్ లక్ష్యంగా కనిపిస్తున్నది.
విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు కేవలం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజధాని, శతాబ్ధి, గతిమాన్, తేజస్ రైళ్లలో 360 రోజుల ముందుగానే టికెట్లు అందుబాటులో ఉంచుతారు. వీరు థర్డ్ ఏసీ, సెకండ్ స్లీపర్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారు ప్రత్యేక రైళ్లలో టికెట్లను బుక్ చేసుకోలేరు.
భారతదేశంలో పర్యటించడం ద్వారా సెలవులను ఆస్వాదించాలనుకునే విదేశీయులు ట్రావెల్ ఏజెంట్ల మీద ఆధారపడకుండా క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి 360 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వారి వీసా, పాస్‌పోర్ట్, ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ల వివరాలను ఐఆర్సీటీసీ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
ముందస్తు రిజర్వేషన్ కింద రూ.200 లెవీని ఐఆర్సీటీసీ విధిస్తుంది. ఇక అనుకోని పరిస్థితుల్లో టికెట్ రద్దు చేసుకుంటే మొత్తం సొమ్ములో రూ.50 తగ్గించి మిగిలిన సొమ్మును వారి ఖాతాలకు ఐఆర్సీటీసీ జమ చేస్తుంది. యాప్ ద్వారా ఆఫర్‌పై టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విశ్రాంతి గదులు, ట్యాక్సీలు, పోర్టర్లు, ఆహారం, సమాచారం తదితర సౌకర్యాలను పొందవచ్చు.