//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూపాయి టమాటా ధర వంద రూపాయలా !

Category : business

తెలుగు వారికి  ఏ కూరలో అయినా టమాటా కలిపి వండుకోవడం పరిపాటి. మూడు, నాలుగు  నెలల  క్రితం కిలో ఒక రూపాయికే  మార్కెట్ లో దొరికిన టమాటాలు  ఇప్పుడు వంద రూపాయలు దాటి ధర పలకడంతో  వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది నెలల ముందు మార్కెట్ లో అమ్మబోతే 25 పైసల నుండి 50 పైసలకు మించి ధర పలుకకపోవడంతో రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావని చాలామంది రైతులు తమ పొలాల వద్దే పారవేసుకున్న ఉదంతాలు ఎన్నో. కానీ ఉప్పుడు టమాటా అపురూపంగా మారింది. 

 మార్కెట్‌లో ప్రస్తుతం కిలో టమాటా 100 నుంచి 110 రూపాయల ధర పలుకుతోంది. దిగుబడి ఈ ఏడాది ఘోరంగా పడిపోవడం, అకాల వర్షాలతో పైర్లు దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులేక కొరత ఏర్పడటంతో  మున్ముందు దీని ధర కిలో రూ. 150కి చేరుకున్నా ఆశ్చర్యం  పడనవసరం లేదని తెలుస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి- ఏప్రిల్ మాసాల మధ్య రాష్ట్రంలో కిలో టమోటా ధర రూ.1కి పడిపోయింది. 

ఇప్పుడు ధర వంద రేట్లు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి ఇది అందని టమాటాగా మారింది.  ఒకవైపు టమాటా ధర సెంచరీ దాటగా, మరోవైపు కిలో 30 నుంచి 40 రూపాయల మధ్య ధర పలికే దొండకాయాల ధర కిలో రూ.1కి పడిపోయింది. అలాగే సాధారణంగా నిమ్మకాయాల బస్తా హోల్‌సెల్ ధర రూ.1000- 1500 మధ్య ఉంటుండగా ప్రస్తుతం బస్తా ధర కేవలం రూ. 100కు పడిపోవడంతో వీటిని సాగు చేసిన రైతన్నలు విలవిలాడిపోతున్నారు.

తెలంగాణలో టమాటా సాగు అతి తక్కువ. తెలంగాణలో వినియోగించే టమాటాలో స్థానికంగా పండేది కేవలం 3 శాతం మాత్రమే. ఇక్కడికి 80 శాతం టమాటా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి సరఫరా అవుతుండగా, మిగిలిన 20 శాతం కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. 

మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో చిత్తూరు జిల్లా మార్కెట్ నుంచి తెలంగాణకు సరఫరా అయ్యే సింహభాగం టమాటా పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది.  అనంతపురం జిల్లాలో భారీగా సాగు చేసే టమాటా ఇంకా పిందె దశలో ఉండటం వల్ల మరికొన్ని వారాలపాటు ధర తగ్గుముకం పట్టేపరిస్థితి కనిపించడం లేదు.