ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. గురువారం కాందహార్ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు. రెండు కారు బాంబులను పేల్చిన ఘటనతో దాదాపు 41 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ రక్షణశాఖ ప్రతినిధి దౌలత్ వజిరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగినట్లు ధ్రువీకరించారు. అయితే.. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఆ దేశ మీడియా వర్గాల సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. తాలిబన్లను వ్యతిరేకిస్తూ ఆఫ్గాన్ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆ కారు బాంబు పేలుడు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.