ప్రతి మనిషికి ఆకాశంలో ఎగరాలని ఉంటుంది. మనకు కూడా పక్షి లాగా రెక్కలు ఉంటే ఎంచక్కా ఎగిరేవాళ్ళం అని చాలా మంది భావిస్తుంటారు. ఇప్పుడు ఆ ఆశను నిజం చేస్తూ సిలికాన్వాలీకి చెందిన ఫ్లైయింగ్ కార్ స్టార్టప్ కంపెనీ ‘కిట్టీ హాక్’ అనే పర్సనల్ ఫ్లైయింగ్ మెషీన్ వాహనాన్ని రూపొందించింది.
కిట్టీహాక్ కంపెనీ సోమవారం ఈ వాహనానికి సంబంధించిన ఎయిర్‌బోర్న్ ప్రొటోటైప్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఓకే సీటు ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రదర్శించారు. ఓ సరస్సు నుంచి అది టేకాఫ్ అయి గాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను చూపించారు. 8 మోటార్లు కలిగి ఉన్న ఈ క్రాఫ్ట్ హెలికాప్టర్ మాదిరిగానే టేకాఫ్, ల్యాండింగ్ అవుతుంది. 220 పౌండ్ల బరువుండే ఈ వాహనం గంటకు 25 మైళ్ల వేగంతో దూసుకెళ్తొంది. 15 మీటర్ల ఎత్తు వరకూ ఇది ఎగరగలుగుతుంది ‘పర్సనల్ ఫ్లయింగ్ మెషీన్’ను ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది.
‘ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఫ్లైట్ ఉండాలనే కలను మేం నిజం చేయాలనుకుంటున్నాం. అందరూ వీటిని వాడితే పరిమితులు లేని సరికొత్త ప్రపంచం వారి ముందుంటుంది’ అని కిట్టీహాక్ కంపెనీ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇది పూర్తిగా సురక్షితమైనదని, అన్ని రకాల ప్రయోగాలు చేపట్టినట్లు , అమెరికాలో రద్దీలేని కొన్ని ప్రాంతాల్లో వీటిని నడిపేందుకు అనుమతి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వీటిని నడపడానికి పైలట్ లైసెన్స్ ఏదీ అక్కర్లేదని.. రెండు గంటల శిక్షణ సరిపోతుందని కంపెనీ చెబుతోంది. 2017 చివరినాటికి వీటిని అమ్మకానికి సిద్ధంగా ఉంచుతామని వెల్లడించింది.