సినీ నటి శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ విషయం మీద భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమె మృతి విషయంలో ఎలాంటి సందేహాలు లేవని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ.. యూఏఈ ప్రభుత్వం విచారణ పత్రాలు అన్నీ తమకు అందాయని చెప్పారు.
ఆ విచారణ నివేదిక ప్రకారమే ఆమె మృతదేహం ఇండియాకు వచ్చిందని, ఒకవేళ ఆమె మృతి అనుమానాస్పదంగా ఉంటే ఇప్పటివరకు ఆ కారణమేంటో బయటకు వచ్చేది కదా అని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించినట్లు యూఏఈ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని ఓ హోటల్లో బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. పొరపాటున బాత్ టబ్ లో పడి, చనిపోయిందని దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు పేర్కొంది. ఆమె ఫిబ్రవరి 24న చనిపోయినా.. ఫిబ్రవరి 27నగానీ ఆమె మృతదేహం ఇండియాకు రాలేదు.
దుబాయ్ అధికారులు ఈ కేసుపై పూర్తి విచారణ జరిపి ప్రమాదవశాత్తూ జరిగిందేనని నిర్ధారించుకున్న తర్వాతే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిబ్రవరి 28న ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరపగా.. ఈ మధ్యే ఆమె అస్తికలను హరిద్వార్‌లో నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే.