అవి చీమలు పెట్టిన పుట్టలు కాదు.. మనుషులు కట్టిన భవనాలు అంతకన్నా కాదు. చూడటానికి శంఖువు ఆకారంలో చిన్న చిన్న పర్వతాల్లా కనిపిస్తున్న వీటిని 'ఎర్త్ పిరమిడ్లు' అంటారు. ఈ అసాధారణ నిర్మాణాలు ఇటలీలోని దక్షిణ టైరోల్ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. రిట్టెన్ ప్రాంతంలోని ఎర్త్పిరమిడ్లు మరింత చూడముచ్చటగా ఉంటాయి. ఈ రకమైన నిర్మాణాలను అదే దేశంలోని పూస్టర్ లోయలోనూ గుర్తించారు. హిమనీ నదాలు కరిగిపోయిన తర్వాత మిగిలిన మొరయిన్ మట్టితో ఏర్పడినవే ఈ ఎర్త్ పిరమిడ్లు. ఇవి ఒక్కొక్కటి దాదాపు 10 నుంచి 15 మీటర్ల పొడవుంటాయి. వాటి పైభాగాన ఓ రాయి ఉంటుంది.ఇది కూడా సహజసిద్ధంగా అమరినదే. వర్షాకాలంలో ఇవి క్రమేపీ కరిగిపోతూ మట్టిలో కలిసిపోతుంటాయి.అసలెందుకిలా ఏర్పడతాయి! కొన్ని వేల సంవత్సరాల క్రితం టైరోల్ ప్రాంతంలోని హిమనీ నదాలు కరిగిపోయిన తర్వాత మొరయిన్ మట్టి దిబ్బలు ఏర్పడ్డాయి.ఇవి ఏటవాలుగా ఉండటం వల్ల వర్షాకాలంలో కోతకు గురువుతుంటాయి. ఈ సమయంలో ఏదైనా రాయి లాంటి గట్టి నిర్మాణం అడ్డుతగిలినపుడు ఆ భాగం తప్ప మిగిలిన భాగమంతా కరిగిపోతుంది. తరచూ జరగడం వల్ల పిరమిడ్ లాంటి ఈ అసాధారణ నిర్మాణాలు రూపు దిద్దుకుంటున్నాయి. ఇలా ఏర్పడటానికి కొన్ని వందల సంవత్సరాలైనా పడుతుందట.