వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కు సంబంధించిన విధి, విధానాలను జీఎస్టీ దాదాపుగా ఖరారు చేయడంతో జులై 1 నుండి అమలు చేయాలని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పట్టుదలగా ఉండటం, అందుకు దాదాపు అన్ని రాస్త్రాల ఆర్ధిక మంత్రులు సుముఖత వ్యక్తం చేయడం జరిగినా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తున్నది. సాంకేతికపరమైన సన్నాహాలు పూర్తి కావడానికి మరి కొన్ని నెలలు వేచి ఉండవలసిందే అని నిపుణులు భావిస్తున్నారు.
జులై 1 నుండి జీఎస్టీ అమలు తమకు సాధ్యం కాదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. పార్లమెంటరీ కమిటీ ముందు దీని అమలుకు బ్యాంక్ లు తమ సిస్టమ్ లలో పలు మార్పులు తీసుకు రావలసి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. స్వాతంత్ర్య భారత దేశంలో అతి పెద్ద పన్ను సంస్కరణగా భావించే జీఎస్టీ అమలు వల్లన జిడిపి రెండు శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
పైగా, బ్యాంక్ లు అందిస్తున్న పలు సేవలు కేంద్రికృతంగా ఉంటూ ఉండగా, మరి కొన్ని సేవలు స్థానికంగా ఉంటున్నాయని, దానితో విధానపరంగా పలు మార్పులు తీసుకు రావలసి ఉంటుందని కూడా బ్యాంక్ లు తెలిపాయి. అటువంటి మార్పులు తక్షణమే తీసుకు రావడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నాయి.
మరో వంక, జీఎస్టీ అమలు మరికొన్ని రోజులు ఆలస్యం కావొచ్చని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా సహితం భావిస్తున్నారు. జీఎస్టీ నెట్వర్క్ పనులపై అసంతృప్తి వ్యక్తమవుతోందని ఈ నేపథ్యంలో మరికొన్నాళ్లు జాప్యం జరగవచ్చని ఆయన చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ తరచూ మార్పులు సూచిస్తోందని అంటూ వీటిని జీఎస్టీ నెట్వర్క్ అందుకోలేకపోతోందని అన్నారు.
నెట్వర్క్లో భారీ లావాదేవీలు జరుగుతాయి కాబట్టి గట్టి పర్యవేక్షణ తప్పనిసరి అని ఆయన తెలిపారు. జులై 1కి ఏమీ ప్రత్యేక లేనందున, ఆ రోజునే అమలు ప్రారంభించాలనే పట్టుదల ఎందుకని అన్నారు. ఇటీవల రాన్సమ్వేర్ ప్రభావాన్ని చూశామని గుర్తు చేస్తూ ఇప్పటి వరకూ జీఎస్టీ నెట్వర్క్ పరీక్షలకు కూడా వెళ్లలేదని చెప్పారు. నెట్వర్క్ సంసిద్ధతకు మరింత సమయం అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.