టీమిండియా చీఫ్ కోచ్ గా అనిల్ కుంబ్లే ను సాగనంపడం పట్ల క్రికెట్ వర్గాలలో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. కోచ్‌ను కాదు, అతన్ని వ్యతిరేకించే ప్లేయర్స్‌ను టీమ్ నుంచి సాగనంపాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పష్టంచేశాడు. ఇలా ప్లేయర్స్ చెప్పినట్లు కోచ్‌ను మార్చడం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందో తేల్చుకోవాలని బోర్డుకు సూచించాడు.
"కోచ్‌గా కుంబ్లే రాజీనామాతో తాను గెలిచానని సంబరాలు చేసుకోవచ్చు. కానీ విరాట్ తప్పు చేశాడు. అతని మాట విని బీసీసీఐ తప్పు చేసింది. నిన్నగాక మొన్న కెప్టెన్ అయిన ఓ ప్లేయర్‌ను బతిమాలో, బెదిరించో ఒప్పించాల్సిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ తన చేతగానితనాన్ని బయటపెట్టుకుంది" అని సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.
"ప్లేయర్స్ చెప్పినట్లు ఉంటే ఉండండి, లేదంటే కుంబ్లేలాగా వెళ్లిపోండి" అన్న సంకేతం తర్వాతి కోచ్‌కు ఇచ్చినట్లు అయిందని గవాస్కర్ హెచ్చరించారు. కుంబ్లే తన ఏడాది పదవీకాలంలో అద్భుతమైన విజయాలు టీమ్‌కు సాధించిపెట్టాడని, ప్లేయర్‌గా, వ్యక్తిగతంగా కూడా అతనో గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా సన్నీ కొనియాడాడు. విరాట్ ఏమనుకున్నాడో, ఎలాంటి కారణాలు అతడు చెబుతాడో తనకు తెలియదని, అయితే ఇది మాత్రం ఇండియన్ క్రికెట్‌కు దురదృష్టకరమైన రోజు అని గవాస్కర్ తేల్చి చెప్పాడు.
"విరాట్ నువ్వు గొప్ప బ్యాట్స్‌మన్‌వి కావచ్చు. కానీ కెప్టెన్సీలో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నావన్న విషయం గుర్తుంచుకో. బీసీసీఐ పెంచి పోషించిన సూపర్ స్టార్ స్టేటస్ నీ మాట నెగ్గేలా చేసి ఉండొచ్చు. కుంబ్లేలాంటి కోచ్ సేవలు కోల్పోవడం వల్ల నీకు నష్టం లేకపోవచ్చుగానీ టీమ్‌కు మాత్రం కచ్చితంగా నష్టమే. తమతో కఠినంగా ఉంటున్నాడన్న ఒక్క కారణం చెప్పి అంతటి అనుభవం ఉన్న ఓ లెజెండరీ ప్లేయర్‌ను అవమానకర రీతిలో సాగనంపడం టీమ్‌కు అస్సలు మంచిది కాదు" అని పలువురు సీనియర్ ప్లేయర్స్ హెచ్చరిస్తున్నారు.