//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో 80 ఏండ్లలో అగ్నిగుండం కానున్న ఉత్తరభారతం

Category : national

పెరుగుతున్న భూతాపం కారణంగా మరో 80 ఏళ్లలో ఉత్తరభారతం అగ్నిగుండవమవుతుందని తాజా పరిశోధనల హెచ్చరిస్తున్నాయి. 2100 నాటికి భారత్ సహా దక్షిణాసియా ప్రాంతం అంతటా వేడి, ఉక్కపోతతో ప్రజలు నివసించలేని స్థితి నెలకొంటుందని పరిశోధనలు తేల్చాయి.

కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోని ఫలితంగా ఈ శతాబ్దం చివరికల్లా భారత్‌లోని అత్యధిక భాగం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో మనుషులు తట్టుకోలేని వాతావరణమార్పులు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. 75 శాతం మంది ప్రజలు తట్టుకోలేని ప్రమాదకర ఉష్ణోగ్రతలను చవిచూస్తారని, నాలుగు శాతం మంది ఎయిర్ కండీషనర్లు లేకుండా జీవించలేని పరిస్థితిని ఎదుర్కొంటారని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 మసాచుస్సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ ఎల్‌ఫెయిత్ ఎల్తహిర్, లయోలా మేరీమౌంట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జెరేమీ పాల్, హాంకాంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఉన్‌సూన్ ఇమ్ ఈ అంశంపై పలు పరిశోధనలు చేశారు. మానవులు తట్టుకోగలిగే వాతావరణ స్థాయిపై ఆర్ద్రగోళ ఉష్ణమాపనం (వెట్‌బల్బ్ టెంపరేచర్) ఆధారంగా పరిశోధనలు కొనసాగించారు.

వేడిగాలుల తీవ్రత, ఉక్కపోత కొన్ని దశాబ్దాల్లోనే ప్రాణాంతకస్థాయికి చేరుకుంటుందని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన వీరి అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గంగా-సింధు బేసిన్‌లో ఈ వాతావరణ మార్పుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని పేర్కొన్నారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు ఎక్కువసేపు బయట ఉండలేని, బయట పనిచేయలేని స్థితి నెలకొంటుందని అధ్యయనం వెల్లడించింది.

ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతల మార్పు పంటలపై ప్రభావం చూపుతుందని, తద్వారా ఆహారభద్రత దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.