ఎస్.బి.ఐ తమ ఖాతాదారులకు ఓ శుభవార్త అందించింది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని ఎస్.బి.ఐ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఛార్జీల బాదుడును ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీవేస్తారో? మా పరిస్థితేంటి? అని ఖాతాదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాగా వారి ఆందోళనలపై ఎస్.బి.ఐ స్పందించింది. కొన్ని అకౌంట్ల ఖాతాదారులకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు ప్రకటించింది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతాలు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. మరియు కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ నెలసరి బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది.