దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త శిఖరాగ్రాలకు చేరుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ 10 వేలు మైలురాయిని అధిగమించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 32,350 ఎగువ స్థాయికి చేరుకుంది. అయితే, ఈ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు మళ్లీ కిందికి జారుకున్నాయి.
ఇంట్రాడేలో 10, 011.30 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న నిఫ్టీ చివర్లో 1.85 పాయింట్లు తగ్గి 9,964.55 వద్ద స్థిరపడింది. అయితే బుధవారం 10,020 వద్ద ముగియడంతో ఐదంకెలను చేరుకున్నట్లయింది. అలాగే, 32,374.30 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసుకున్న సెన్సెక్స్ ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ నిలిచేసరికి 17.60 పాయింట్ల నష్టంతో 32,228.27 వద్ద ముగిసింది.
కార్పొరేట్ సంస్థల మొదటి త్రైమాసిక ఫలితాల సీజన్ ఆశాజనకంగా ఉండటంతోపాటు దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్లోకి జోరుగా నిధులు చొప్పిస్తుండటంతో సూచీలు రోజుకో రికార్డును బ్రేక్ చేస్తూ వస్తున్నాయి. అయితే, సరికొత్త ఆల్‌టైం గరిష్ఠాల్లో సూచీలు నిలదొక్కుకోలేవేమో అన్న భయాలతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.
బుధవారంతో ముగియనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్ష నేపథ్యంలో మదుపర్లు ముందుజాగ్రత్తగా వ్యవహరించడం కూడా సూచీలు కిందికి జారుకోవడానికి కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సైతం పెద్దగా మద్దతు లభించలేదు.