భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.ఎక్కువ వేతనం పొందేవారికి, ప్రతిభ గలవారికి మాత్రమే వీసాలు దక్కేలా హెచ్-1బీ విధానంలో మార్పులను సూచించాలని విదేశాంగ, కార్మిక, అంతర్గత భద్రత మంత్రులు, అటార్నీ జనరల్‌లను ట్రంప్ ఆదేశించారు. ‘అమెరికా ఉత్పత్తులను కొనాలి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలి’ అని తానిచ్చిన నినాదాన్ని అనుసరిస్తూ ట్రంప్ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికన్లకు దక్కాల్సిన జాబులను తక్కువ వేతనాలతో విదేశీయులు కొల్లగొడుతున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇకపై ఉద్యోగాల్లో అమెకన్లనే నియమించుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల లాటరీ ప్రక్రియకు ఇక స్వస్తి చెప్పాలని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పటికిప్పుడు H -1B వీసాలపై ప్రభావం చూపబోదని, అందుకు కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. దేశ ఐటీ రంగంపై ప్రభావమేమీ ఉండదని, కానీ భవిష్యత్తులో ప్రతికూల పరిణామాలు ఎదురవ్వచ్చని భారత ఐటీ సంస్థల సంఘం నాస్కామ్ తెలిపింది.