దుబాయ్‌లో హోటల్ గదిలో శ్రీదేవి మృతిచెందిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి ప్రమాదవశాత్తుగా నీళ్లలో మునిగి మృతి చెందారు అంటూ అక్కడి ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
శ్రీదేవి మృతికి కారణం ఏంటనేది మాత్రమే డెత్ సర్టిఫికెట్లో వెల్లడించాల్సి వుంటుంది కానీ అది ప్రమాదవశాత్తుగా జరిగిందా లేక పథకం ప్రకారం జరిగిందా అనే క్లారిటీ దుబాయ్ వైద్య ఆరోగ్య శాఖ ఎలా తేల్చిచెబుతుందనే కొంతమంది వాదన. కేవలం నీళ్లలో మునగడం వల్లే శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిందని చెప్పడం వరకు మాత్రమే డెత్ సర్టిఫికెట్ జారీ చేసే వారి విధి. ఆమె అలా బాత్రూమ్లో నిజంగానే ప్రమాదవశాత్తుగా నీళ్లలో మునగడం వల్ల చనిపోయిందా లేక ఇంకేమైనా కుట్ర జరిగిందా అనే మిగతా విషయాలన్నీ అక్కడి పోలీసులు చేపట్టే దర్యాప్తులో తేలుతుంది అనేది ఇంకొందరు వాదిస్తున్న అంశం.
దుబాయ్‌లో ఫిబ్రవరి 20వ, తేదిన మొహిత్ మార్వా వివాహం జరిగింది. అయితే శ్రీదేవి ఫిబ్రవరి 24వ, తేదిన మరణించింది. వివాహమైన తర్వాత బోనికపూర్ చిన్న కూతురితో కలిసి ముంబైకి తిరిగి వచ్చాడు. కానీ, శ్రీదేవి దుబాయ్‌లోనే ఉండిపోయింది. అయితే దుబాయ్‌లోని బోనికపూర్ స్నేహితుడు శ్రీదేవి తిరిగేందుకు కారును సమకూర్చాడని చెబుతున్నారు. అయితే నాలుగు రోజులుగా ఆమె ఎక్కడికి తిరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వివాహమైన తర్వాత నాలుగు రోజుల పాటు శ్రీదేవి దుబాయ్‌లో ఏం చేసిందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి తిరిగేందుకు కారును ఎవరు సమకూర్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. శ్రీదేవి మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ఫిబ్రవరి 24వ, తేదిన శ్రీదేవి దుబాయ్‌లోని హోటల్ రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.
అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును దుబాయ్ పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించారు.శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతృప్తి చెందేవరకు బౌతికకాయం ముంబైకి తరలి వచ్చే అవకాశమే లేదు.
ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎంబామింగ్ (మృతదేహం పాడవకుండా రసాయనాలతో జరిపే ప్రక్రియ) కూడా ఇంకా పూర్తికానట్టు తెలుస్తోంది. అయితే అన్ని సందేహాలు తీరిన తరువాతే ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తామని పోలీసధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఇక శ్రీదేవి మరణంపై బోనీకపూర్ కుటుంబం నుంచి ఖలీజా టైమ్స్ కు సంజయ్ కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూ మినహా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కుటుంబ సభ్యులు కనీసం ఆమె అంత్యక్రియలకు సంబంధించిన ప్రకటన కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె భౌతికకాయం ఇప్పట్లో భారత్ కు వచ్చే అవకాశం లేదా? వస్తే ఎప్పుడొస్తుందన్న ఆందోళన ఆమె అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఆమె భౌతిక కాయాన్ని ఇండియాకు తరలించేందుకు దుబాయ్ వెళ్లిన రిలయన్స్ విమానం అక్కడే ఉంది.