ఓ కొత్త వైరస్ వాట్సాప్ యూజర్లపై అటాక్ అవుతున్నట్టు తెలిసింది. వాట్సాప్‌ను ఫేస్బుక్ సంస్థ కొనుగోలు చేయకముందు ఆ యాప్‌కు ఏడాదికి 1 డాలర్ రుసుము చెల్లించాలని, అలా చెల్లిస్తే యాప్‌ను ఏడాది పాటు వాడుకోవచ్చని అప్పట్లో మెసేజ్‌లు అందులో కనిపించేవి.
అయితే ఫేస్బుక్ వాట్సాప్‌ను కొన్నాక ఆ యాప్‌ను ఉచితంగానే ఇస్తున్నారు. అందుకు ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడు కొందరు హ్యాకర్లు దీన్ని ఆసరాగా చేసుకుని వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారు.
వాట్సాప్ యూజర్లకు వారు ఓ మెసేజ్‌ను ప్రస్తుతం వైరల్‌లా పంపుతున్నారు. అందులో 'మీరు వాడుతున్న వాట్సాప్ ఏడాది సర్వీసు పూర్తయిందని, వెంటనే 1 డాలర్ ఫీజును చెల్లించాలని, లేదంటే సేవలు నిలిపివేయబడతాయ'ని ఉంటుంది.
దీంతో అది నిజమే అని నమ్మిన యూజర్లు ఆ ఫీజును చెల్లించేందుకు మెసేజ్‌లో ఉంచిన లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. దీంతో వారి డివైస్‌లు వైరస్ బారిన పడి హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఇటువంటి మెసేజ్ లను నమ్మి వాటిల్లో ఉండే లింక్ లను క్లిక్ చేస్తే వైరస్ వచ్చి డివైస్‌లో ఉన్న డేటా అంతా తుడిచి పెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు.