రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణీకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ 'ప్రాజెక్ట్ స్వర్ణ్' పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 25 కోట్ల రూపాయిలతో 30 రైళ్లను ఆధునీకరించనున్నారు. ఇందులో 15 రాజధాని, 15 శతాబ్ధి రైళ్ళు వున్నాయి. రైళ్ల సమయ పాలన, కేటరింగ్, టాయిలెట్ల నిర్వహణ వంటి అంశాలను ఆధునీకరిస్తారు.
అలాగే సిబ్బందికి యూనిఫామ్, ప్రయాణీకులకు సినిమాలు, సీరియల్స్, సంగీతం వంటి సరికొత్త వినోదాలను అందించనున్నారు. రైలు పెట్టెలను లోపల, బయట కూడా అందంగా తీర్చిదిద్దుతారు. టాయిలెట్ వ్యవస్థను మెరుగుపరచడం, శుభ్రతను పాటించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. భద్రతా వ్యవస్థనూ ఆధునీకరిస్తారు. ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఒక ఎస్కార్ట్‌ను అందుబాటులో వుంచుతారు.
దసరా సందర్భంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుంది. దసరా నేపథ్యంలో మూడు నెలల్లో ఈ 30 రైళ్లను ఆధునీకరించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముంబయి, హౌరా, పాట్నా, రాంచీ, భువనేశ్వర్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను, హౌరా, పూరీ, న్యూఢిల్లీ, చంఢఘీడ్, కాన్పూర్, రాంచీ మధ్య నడిచే శతాబ్ధి రైళ్లను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.
ఈ రైళ్లలో సిబ్బందికి యూనిఫామ్ ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు సేవలు అందించడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే ఈ ప్రీమియర్ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరగకుండా, సమయానికి నడిచే విధంగా చర్యలు తీసుకోనున్నారు.