ఐటి రంగంలో ఉద్యోగాలు కొలిపోయినా కొత్త టెక్నాలజీలలో తగు శిక్షణ పొందితే కొత్త ఉద్యోగాలు సంపాదించుకో వచ్చని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే రెండేండ్లలో దేశంలోని ఐటీ రంగంలో 2 లక్షల మంది ఉద్యోగం కోల్పోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వారిలో సగం మంది కొత్త టెక్నాలజీల్లో శిక్షణ పొంది అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందని సీఐఈఎల్ హెచ్ సర్వీసెస్ సర్వే నివేదిక వెల్లడించింది.
50 ఐటీ కంపెనీల్లోని మిడ్, సీనియర్ ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, టెస్టింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉద్యోగం కోల్పోయే ముప్పు పెరిగిందని ఈ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అయితే, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తోపాటు ఇతర టెక్నాలజీల్లో అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మిగతా యాభై శాతం మందికి మాత్రం మళ్లీ ఐటీ ఉద్యోగం దొరకకపోవచ్చని, ఇతర రంగాల్లో అవకాశాలు చూసుకోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రంగంలో బోట్స్ వంటి ఆటోమేటెడ్ టూల్స్ మానవ వనరుల అవసరాన్ని తగ్గిస్తున్నాయి. దాంతో చాలా విభాగాల్లో పనిచేస్తున్నవారి ఉద్యోగానికి ముప్పు ఏర్పడిందని ఆయన చెప్పారు.
సీఐఈఎల్ సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 33 శాతం మంది మాత్రమే ఆటోమేషన్, సామాజిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారట. ఐటీ రంగంలో ఊహించిన దానికంటే ముందుగానే భారీ మార్పులు రావడమే ఉద్యోగాలకు ముప్పు తెచ్చిందని 44 శాతం మంది భావిస్తున్నారు.