నోట్ల రద్దు అనంతరం దేశంలో కొత్త ఏటీఎమ్ కేంద్రాల ఏర్పాటు పెద్ద ఎత్తున తగ్గిపోతున్నది. ముఖ్యంగా బ్యాంకు ఆవరణ లో (ఆన్సైట్) ఉండే ఎటిఎంలతో పోల్చితే ఇతర ప్రదేశాల్లో (ఆఫ్ సైట్) ఏర్పాటు చేసే ఎటిఎంల సంఖ్య భారీగా తగ్గుతున్నది.
రిజర్వు బ్యాంకు గణంకాల ప్రకారం జూన్ 2017 నాటికి ఆఫ్ సైట్ ఎటిఎం సంఖ్య 98,092కు పడిపోయింది. 2016 ఇదే కాలం నాటికి ఈ సంఖ్య 99,989గా ఉంది. కాగా ఆన్సైట్ ఎటిఎంల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరి గింది. ఈ ఏడాది జూన్ నాటికి ఆన్సైట్ ఎటిఎంల సంఖ్య 1,10,385కి చేరింది. గతేడాడాది ఈ సంఖ్య 1,01,346గా ఉంది.
నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు పెద్దఎత్తున నగదు సంక్షోభాన్ని ఎదుర్కోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఉన్న ఎటిఎంల్లోనూ ఇప్పటికీ నగదు కొరత కనిపిస్తూ ఉండడంతో, దాని ప్రభావం ఎటిఎం కేంద్రాల విస్తరణపై తీవ్రంగా పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెంచాలన్న లక్ష్యంలో భాగంగా ఎటిఎం కేంద్రాల్లో నగదు కొరతను కావాలనే సృష్టిస్తున్నట్లు భావిస్తున్నారు.
జూన్ 2016 నుంచి జూన్ 2017 మధ్య దాదాపుగా 7,000 కొత్త ఎటిఎంలను ఏర్పాటు చేశారు. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఏకంగా దాదాపు 16,000 ఎటిఎం కేంద్రాలను నెలకొల్పారు. ఇంతకంటే ముందు ఏడాది ఏకంగా 18,500 కొత్త ఎటిఎం కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కాలంగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల ఆఫ్‌సైట్ ఎటిఎం కేంద్రాల సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకుంది. కాగా భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎస్బిఐలో మాత్రం ఎటిఎంల సంఖ్య పెరిగింది.