ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీ అరేబియా రాజు సల్మాన్ తన కుమారుడు మహ్మ ద్ బిన్ సల్మాన్ (31)ను యువరాజుగా ప్రకటించారు. అంతకుముందు యువరాజుగా ఉన్న హోమ్ మంత్రి అయిన తన మేనలుడిని ఆ పదవి నుంచి తొలగించి సర్వాధికారాలను తన కుమారునికి కట్టబెట్టారు. ఈ మేరకు రాజశాసనాన్ని విడుదల చేశారు.
అమెరికాకు అనుకూలంగా వ్యవహరించే నయీఫ్‌ను పదవి నుండి మాత్రమే కాక వారసత్వ జాబితా నుండి కూడా తప్పించిన రాజు నిర్ణయం రాజకీయంగా సంచలనం కలిగించింది. కతార్‌ను ఏకాకిని చేసేందుకు ఇటీవల సౌదీ, ఎమిరేట్స్ చేసిన ప్రయత్నాలలో నయీఫ్ కీలక పాత్ర పోషించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన నిర్ణయానికి సౌదీ ప్రజలంతా విధేయత ప్రకటించాలని రాజు సల్మాన్ కోరారు. యువరాజుగా నియమితుడైన మహమ్మద్ బిన్ సల్మాన్ ఉపప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. రక్షణ, చమురు, ఆర్థికవ్యవహారాలు తదితర శాఖలు ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి.
యువకుడైన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. అల్ సౌద్ కుటుంబానికి చెందిన 34 మంది సీనియర్ సభ్యుల్లో 31 మంది రాజు సల్మాన్ నిర్ణయానికి మద్దతు పలికారని రాజశాసనం వెల్లడించింది. ఈ మేరకు మాజీ యువరాజు మహమ్మద్ అల్ నాయెఫ్ నూతన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా సల్మాన్ నాయెఫ్ చేతిని ముద్దాడారు. ఖతార్, ఇరాన్‌లతో వివాదాలు తీవ్రస్థాయికి చేరడంతోపాటు యెమన్‌లో యుద్ధం కొనసాగుతుండగా రాజు యువరాజుగా తన కుమారున్ని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.