అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలు కలిసి సంయుక్తంగా ఓ భారీ ప్రాజెక్టును చేపట్టాయి. భూఉపగ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు నిసార్ అనే ఉపగ్రహాన్నిఅభివృద్ధి చేస్తూ ఉన్నాయి. నిసార్ సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్ కోసం రెండు దేశాలు సుమారు ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ శాటిలైట్ రూపొందించేందుకు ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు కంటిమీద కునుక లేకుండా పనిచేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని రెండు ఫ్రీక్వెన్సీ (ఎల్ & ఎస్ బ్యాండ్)లు ఉన్న రాడార్ గా అభివృద్ధి చేయనున్నారు. ఎల్ బ్యాండ్ లో 24 సెంటీమీటర్ల రాడార్, ఎస్ బ్యాండ్‌లో 13 సెంటీమీటర్ల రాడార్ ఉంటుంది. ఎస్ బ్యాండ్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్‌ను నాసా అభివృద్ధి చేస్తున్నాయి. నిసార్ శాటిలైట్‌ను 2021వ సంవత్సరంలో నింగిలోకి జీఎస్ఎల్వీ ద్వారా దీన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు. ఈ ఉపగ్రహ నిర్మాణం వల్ల అమెరికా, భారత్ మధ్య అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంది. శాటిలైట్‌లో ఉన్న రాడార్లతో ప్రతి వారం భూమి ఫోటోలను తీయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వాటి వల్ల భూ ఫలకాల్లో ఏర్పడుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ శాటిలైట్ అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు.