దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నానో వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో సతీష్ బోర్వంకర్ మాట్లాడుతూ నానో కారు విషయంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడం జరిగిందని, దీంట్లోభాగంగా ఎలక్ట్రిక్ వెర్షన్ను సైతం విడుదల చేసే అవకాశం కూడా ఉందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నానో ఉత్పత్తి ఆచరణయోగ్యం కావడం లేదన్నారు. సెంటిమెంట్ కారణంగా నానో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయడం లేదని, వాటాదారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. నానో కారును ఉత్పత్తి చేయడానికి గుజరాత్లోని సనందలో ఏర్పాటు చేసిన ప్లాంట్లో ప్రస్తుతం నెలకు వెయ్యి నానో కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.
సనంద ప్లాంట్లో ఉన్న అసెంబ్లింగ్ లైన్లోనే నానో తోపాటు టియాగో, టైగర్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సతీష్ చెప్పారు. ఎస్యూవీ, కమర్షియల్ మార్కెట్లో ఒకప్పుడు సత్తా చాటిన సంస్థ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. వచ్చే దీపావళి కంటే ముందుగానే మరో ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.