//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నంది కోసం హద్దులు మీరుతున్నారా?

Category : editorial

నిజమే మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎవరిపైనయినా యథేచ్ఛగా విమర్శలు చేయవచ్చు. తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు. తమ నిరసనను నిరభ్యంతరంగా వ్యక్తీకరించవచ్చు. అయితే.. ఆ నిరసనలు, విమర్శలు ఎదుటివారి మనోభావాలను పొరపాటున కూడా గాయపరచకూడదు. నీ చేయిని నీ ఇష్టం వచ్చినట్లు సాచవచ్చు.. లేదా గాల్లో తిప్పుకోవచ్చు.

కానీ అది ఎదుటివారి ముక్కుకు తగలనంతవరకు మాత్రమేనన్న విషయాన్నిఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు మన చిత్ర పరిశ్రమలో కొందరు వ్యక్తులు 'ఆ స్పృహ' లేకుండా విమర్శలు చేస్తున్నారేమోననిపిస్తోంది. అవును.. నంది అవార్డుల ఎంపికపై వెలువడుతున్న విమర్శల పై ఇప్పుడు ఇటువంటి విమర్శలే వెలువడుతున్నాయి. నంది అవార్డుల ఎంపికను తప్పు పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు మరీ శృతిమించుతున్నాయని చెప్పక తప్పదు.

నంది అవార్డుల ఎంపిక తీరును తప్పు పడుతూ ఒక ప్రముఖ దర్శకుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు స్వయంగా దగ్గరుండి.. మిగతా పనులన్నీ మానుకొని అవార్డుల ఎంపికను పర్యవేక్షించినట్లుగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఆ లేఖ రాశారు. మరో యువ నిర్మాత.. మరి కొంచెం ముందుకెళ్లి.. నంది అవార్డులు గెలుచుకోవాలంటే.. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నటనలో మెళకువలు నేర్చుకోవాలేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

చెక్ బౌన్స్ సహా పలు పోలీసు కేసులు ఎదుర్కొంటున్న మరొక ఆల్ రౌండర్ నంది అవార్డుల్ని సైకిల్ అవార్డులుగా ప్రకటించి పారేశాడు. ప్రభుత్వంచే నియమితమైన జ్యూరీ ఎంపిక చేసిన అవార్డుల్లో లోపాలు ఎత్తి చూపడం ఎంతమాత్రం తప్పుకాదు. కానీ అందుకు ఏకంగా ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం, సాక్షాత్తూ ప్రభుత్వాధినేతకు పక్షపాతాన్ని అంటగట్టాలని చూడడం మాత్రం సమర్ధనీయం కాదు. తమకు, తమ సినిమాలకు అవార్డులు రాకపోవడంపై అసంతృప్తి చెందడం వరకు ఓకే. కానీ.. అవార్డులు గెలుచుకున్న సినిమాలను చులకన చేసి మాట్లాడడం కచ్చితంగా క్షంతవ్యం కాదు.

అవార్డులు గెలుచుకున్నవారు ఆనంద పడకుండా.. వారు గిల్టీగా ఫిలయ్యేలా చేయడం సంస్కారం కూడా కాదు. ఇటువంటి వాచాలత్వం కలిగినవారిపై కన్నెర్ర జేయాల్సిన అవసరం, కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇలాంటివాళ్ళను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింతమంది మరిన్ని నేలబారు విమర్శలు చేసే ప్రమాదముంది. ఏ అవార్డు అయితే రాలేదని వాపోతున్నామో.. ఆ అవార్డు ఔన్నత్యం దెబ్బతినేలా వ్యవహరించడం మంచిది కాదు.

రాష్ట్ర విభజన అనంతరం.. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ.. సవాళ్ళను అధిగమిస్తూ నడుస్తున్న ప్రభుత్వం ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశించడమంత అవివేకం మరొకటి ఉండదు. నంది అవార్డుల సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని అభినందిస్తూ.. ఎంపికలో దొర్లిన లోపాలను హుందాగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి తప్ప.. కళాస్పూర్తి ని విస్మరించి.. రాజకీయనాయకుల తరహాలో- ప్రేరేపిత విమర్శలు చేయడం తగదు గాక తగదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలుకూడా.. ఇటువంటి సున్నితమైన, ప్రతిష్టాత్మకమైన విషయాలపై కమిటీలను ఎంపిక చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ ఏటికాయేడు అవార్డులను ప్రకటిచడం, వాటిని ప్రదానం చేయడంపై కూడా దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలి.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై వెల్లువెత్తిన విమర్శలను.. తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా ప్రవేశపెట్టి ప్రదానం చేయబోయే 'సింహా' అవార్డుల విషయంలో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. అందరికీ తెలిసిన మాటే ఒకసారి చెప్పుకుందాం.. 'మనం చేసే తప్పుల నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం. కానీ ప్రతి తప్పు మనమే చేసి నేర్చుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. కాబట్టి ఎదుటివారి తప్పులనుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని తప్పులు మనమే చేయలేము కాబట్టి. ఇది వ్యక్తులకే కాదు.. వ్యవస్థలకు, సంస్థలకు కూడా వర్తిస్తుంది!!