మహిళల క్రికెట్‌ను శాసిస్తున్న ఆసీస్‌ను నిలువరించి ఫైనల్ కు చేరడం కోసం భారత మహిళల క్రికెట్ జట్టు నేడు కీలకమైన సెమి ఫైనల్ పోరులో తలపడనుంది. భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగి సెమీస్ లక్ష్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన భారత మహిళల జట్టు వరల్డ్‌కప్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది.
2005 ఫైనల్‌తో పాటు ఇటీవల లీగ్ దశలో కంగారుల చేతిలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు మొత్తం మీద ఓటముల రికార్డును మెరుగుపర్చుకోవడంకోసం మిథాలీసేన సమాయత్తమైనది.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫైనల్ బెర్త్ దక్కించుకోవడం ఇది రెండోసారి అవుతుంది. 2015లో భారత్ టైటిల్ పోరుకు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు జరిగిన 42 మ్యాచుల్లో భారత్ 34సార్లు పరాజయం చవిచూసింది.
కివీస్‌ను ఓడించి సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవడంతో భారత్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే ఫామ్‌ను కంగారులపై కూడా చూపెట్టాలని మిథాలీసేన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. సెమీస్‌కు ఆతిథ్యమిస్తున్న గ్రౌండ్లో ఆసీస్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం, భారత్ ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడి ఉండటంతో పరిస్థితులు సానుకూలంగా ఉండగలవనే విశ్వాసం కలుగుతున్నది.
పూనమ్, స్మృతి మెరుపు ఆరంభాన్నిస్తే భారీ స్కోరుకు హామీ ఇస్తూ ఉండటం, మిథాలీ సూపర్ ఫామ్‌లో ఉండటం, హర్మన్‌ప్రీత్, వేద భారీ హిట్టింగ్ చేస్తుండటం టీమ్ఇండియాకు వరంగా మారనుంది. లోయర్ ఆర్డర్లో సుష్మా వర్మ, శిఖా పాండే, జులన్లలో ఒకరిద్దరు సాయమందించినా తమకు తిరుగు ఉండదని భారత్ ధీమాతో ఉంది.
అయితే, మరోవైపు లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా సూపర్ ఫామ్‌లో ఉంది. టాప్ ఆర్డర్లో మూనీ, లానింగ్, పెర్రీ, బోల్టన్.. వీళ్లలో ఒక్కరు కుదురుకున్నా భారత్‌కు కష్టాలు తప్పవు. భారీ లక్ష్యాలను ఛేదించడంలో ఆసీస్‌ది అందివేసిన చేయి.
దానితో ఏమాత్రం అలసత్వం వహించినా టీమ్ఇండియాకు ముప్పు తప్పదు. మిథాలీ, రౌట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బౌలింగ్‌లో ష్కుట్, గార్డెనర్, పెర్రీని ఎదుర్కొవాలంటే భారత బ్యాట్స్‌వుమెన్ శక్తికి మించి పోరాటం చేయాలి.