హైదరాబాద్: తనలో కదిలే భావాలే తాను నటించిన సినిమాలు అని అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాటమరాయుడు’. శ్రుతిహాసన్ కథానాయిక. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్‌మరార్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు. ఇలాంటి సభల్లో మాట్లాడటం అలవాటు తప్పింది. భయంగా ఉంది. ఇక్కడకు రాలేకపోయిన అభిమానులకు నా క్షమాపణలు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. హీరోను అవుతానని అనుకోలేదు. ఏ పని ఇచ్చినా.. అది తోటపని కావచ్చు.. వీధులు వూడ్చే పని కావచ్చు.. ఎలాంటి పనైనా నిజాయతీగా చేస్తా. సినిమాలు కూడా నాకు భగవంతుడు పెట్టిన భిక్ష. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను. చేస్తాను. భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తాను. జరిగిందా మంచిది.. జరగలేదా ఇంకా మంచిది.. అందరి బిడ్డలూ ఒకటే.
‘గోకులంలో సీత’ సినిమా నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు తెలుసు. నేను చేసిన సినిమాలన్నీ అనుకోకుండా వచ్చినవే. ఆ సినిమాలోని ‘ప్రేమే దైవం.. ప్రేమే సర్వం.. ప్రేమే సృష్టికి మూలం’ అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తిండిపోయింది. త్రివిక్రమ్ నా మిత్రుడు కావడం చాలా సంతోషం. ‘సుస్వాగతం’లో తండ్రిని కోల్పోయినా కథానాయకుడికి తెలియదు. ఆ పాత్ర చేసిన నేను క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చాను. 40 టేక్‌లు చేశాను.
‘జల్సా’ చేసే సమయంలో నా తండ్రి చనిపోతే ఏడ్వలేదు. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు ఏడ్చేశాను. ‘తొలిప్రేమ’ తీసుకుంటే అందులోలాగా ప్రేమించాలి.. అమ్మాయిల చుట్టూ తిరగాలి అనుకుంటాం. బాధ్యత లేని ప్రేమ ఏం? ప్రేమ అనుకున్నా. నాలో కదిలే భావాలు ఒక్కో సినిమాతో బయటకు వచ్చాయి. ‘తమ్ముడు’ సినిమాకు చాలా కష్టపడ్డా. నా ప్రాణాలను పణంగా పెట్టా. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ చేయాల్సి వచ్చింది. ఒక పిచ్చి.. ఉన్మాదంతో చేశా. నా చేతులు ఇప్పటికీ తిరిగిపోతాయి. మన భవిష్యత్ రాయగలిగేది పక్కనోడు కాదు.. మనమే. నా ఎదుగుదల నేను అనుకున్నంత. ఇప్పటికీ కిందిస్థాయిలో ఉండటమే ఇష్టం. నా ఆలోచనా శక్తి పెరగాలి. కానీ నా అడుగులు భూమిని తాకి ఉండాలని కోరుకుంటా. ‘బద్రి’ సినిమా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ కాదు. నువ్వు ఒక మనిషివే అని చెప్పేది. దానిలో ఒక డైలాగ్‌లో ఉంది ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రినాథ్’. అంటే నువ్వూ రక్త మాంసాలు ఉన్న మనిషివే అని చెప్పాడానికి అదే నిదర్శనం. ‘ఖుషి’లో దేశభక్తిని చాటి చెప్పేలా పాట ఉంటుంది. ‘ఖుషి’లో చూసేటప్పుడు అనిపించింది.. రాబోయే రోజులు కష్టకాలం అని. సినిమా చూస్తుంటే ఏదో శక్తి కోల్పోయినట్టు అనిపించింది. అక్కడి నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ‘గబ్బర్‌సింగ్’లో పోలీస్‌స్టేషన్ సన్నివేశాలు చేస్తుంటే తిరిగి ఆ శక్తి వచ్చింది. జీవితం అంటే గెలుపోటముల మిళితం. హార్వర్డ్‌లో కూడా అదే చెప్పా.