పాకిస్థాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత్ పై అణుదాడికి సిద్ధపడి భారత్ నుండి ఎదురు కాగల ప్రతీకార చర్యకు భయపడి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్నీ స్వయంగా ముషారఫ్ చెప్పిన్నట్లు జపాన్‌కు చెందిన పత్రిక మైనిచి షింబున్ వెల్లడించింది.
2001లో భారత్ పార్లమెంట్‌పై దాడి తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయాలనుకున్నానని ముషారఫ్ చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. అంతేకాదు అణుదాడి చేయాలా వద్దా అన్న ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపినట్లు కూడా అతను చెప్పాడు. అణ్వాయుధాల వినియోగంపై అప్పట్లో ముషారఫ్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఆ సమయంలో భారత్ గానీ, పాకిస్థాన్‌గానీ తమ మిస్సైల్స్‌పై న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను లోడ్ చేసి ఉంచలేదని కూడా ముషారఫ్ చెప్పాడు. న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను లోడ్ చేసి మిస్సైల్స్‌ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారా అని ప్రశ్నించగా భారత్ నుంచి ప్రతి దాడులకు భయపడి అసలు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు అంగీకరించాడు.
ఆ తర్వాత రెండు దేశాలు యుద్ధం ఆలోచనను విరమించి ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దుకున్నాయి. 1999లో ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దించి పాక్ పగ్గాలను ముషారఫ్ చేపట్టాడు. 2001 నుంచి 2008 వరకు ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఏడాది కాలంగా అతను దుబాయ్‌లో ఉంటున్నాడు.